Skip to main content
Latest News

‘ఛలో ఆత్మకూరు.. ఇది పల్నాడు సమస్య కాదు.. రాష్ట్ర సమస్య..’

వైసీపీ అరాచకాలు ఒక్క పల్నాడు ప్రాంతానికే పరిమితం కాలేదని.. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ సమస్య ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అయితే పల్నాడు ప్రాంతంలో సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టే.. అక్కడినుంచి పోరాటం మొదలుపెట్టినట్టు చెప్పారు. ఇక ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్దపడుతున్నామని.. రాష్ట్రంలోని టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున బుధవారం గుంటూరుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. 'ఛలో ఆత్మకూరు'పై చర్చించేందుకు మంగళవారం ఉదయం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వైసీపీ శతవిధాలా ప్రయత్నిస్తుందని.. ఒకవేళ వారు అడ్డుపడితే.. ఎక్కడికక్కడ ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. 

బాధితులకు న్యాయం జరిగేవరకు పోరాటాన్ని వదిలే ప్రసక్తే లేదన్నారు. వైసీపీ అరాచకాలను టీడీపీ వెలుగులోకి తీసుకొచ్చేదాకా పోలీసులు ఏం చేసినట్టు అని ప్రశ్నించారు. వైసీపీ అరాచకాల కారణంగా బాధితులంతా 110రోజులుగా గ్రామాలకు దూరంగా ఉన్నారని చెప్పారు. పల్నాడు శరణార్థుల శిబిరంలో పోలీసులు ఓవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు గురజాల డివిజన్‌లో 144 సెక్షన్ విధించారని ఆరోపించారు. ఇదేమని అడిగితే.. పండుగలు,శాంతిభద్రతలు అంటున్నారని మండిపడ్డారు. ఇది రాజకీయ శాంతిభద్రతలకు సంబంధించిన విషయమే తప్ప పండుగల శాంతిభద్రతకు సంబంధించిన విషయం కాదని చెప్పారు. ఇప్పటికైనా బాధితులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేసి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

కాగా ఇదే విషయమై చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు. ‘అధికారులు ఓ వైపు గుంటూరు శిబిరంలో చర్చలు చేస్తూ మరోవైపు గురజాల డివిజన్‌లో 144 సెక్షన్ విధించారు. ఇది రాజకీయ శాంతిభద్రతల సమస్య. పండుగల శాంతిభద్రతల అంశం కాదు. ఇది రాష్ట్ర సమస్య కానీ, కేవలం పల్నాడు ప్రాంత సమస్య కాదు. బాధితులకు న్యాయం చేయాలన్నదే టీడీపీ ధృడ సంకల్పం. తప్పుడు కేసులు అన్నింటినీ ఎత్తేయాలి. ధ్వంసమైన ఆస్తులకు నష్ట పరిహారం చెల్లించాలి. 110 రోజులుగా గ్రామాల నుంచి వెళ్లగొట్టారు. వందలాది కుటుంబాల జీవనోపాధి పోగొట్టారు. వీటన్నింటికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. న్యాయం జరిగేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు..’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఏది ఏమైనా రేపు జరగనున్న ఛలో ఆత్మకూరు ఘటన.. ఏపీలో రాజకీయ రచ్చకు దారితీయబోతోంది. ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొనే అవకాశాలు కూడా లేకపోలేదు. 

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online