Skip to main content
Latest News

నేడు చంద్రబాబు పెళ్లి రోజు.. పెళ్లి చూపుల్లో భువనేశ్వరిని ఏమని అడిగారంటే..

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పెళ్లి రోజు నేడు (సెప్టెంబర్ 10). సరిగ్గా 38 ఏళ్ల క్రితం.. 1981లో చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అప్పట్లో కాంగ్రెస్ నేతగా ఉన్న చంద్రబాబు.. ఎన్టీఆర్ కుమార్తె అయిన భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. పెళ్లి రోజు సందర్భంగా టీడీపీ నాయకులు, నందమూరి అభిమానులు శుభాకాంక్షలు చంద్రబాబు దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు. పెళ్లి నాటికే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నారు. తన పెళ్లి గురించి చంద్రబాబు నాయుడు గతంలో పలుమార్లు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు.. మీకోసం..

తమ పెళ్లి గురించి ముందుగా ఎన్టీఆర్ వైపు నుంచే ప్రతిపాదన వచ్చిందన్నారు. పెద్దవాళ్లతో మాట్లాడి కబురు పంపుతామని చెప్పానని బాబు తెలిపారు. భువనేశ్వరిని పెళ్లాడాలని ఎన్టీఆర్ కోరారని.. మొదట్లో తాను కొంచెం బెట్టు చేశానని చంద్రబాబు నవ్వుతూ చెప్పారు. పెళ్లి చూపులకు వెళ్లగానే పెద్ద పూలమాల తీసుకొచ్చి నా మెడలో వేశారని, దీంతో తాను ఇబ్బందిపడ్డానని బాబు తెలిపారు. పెళ్లి చూపుల్లో భువనేశ్వరీ, నేను మాట్లాడుకున్నామని బాబు చెప్పారు. ‘‘నేను పల్లెటూర్లో పుట్టి పెరిగాను.. మంత్రి పదవి పోతే.. మళ్లీ పల్లెటూరుకు వెళ్లాల్సి ఉంటుంది’’ అని భువనేశ్వరికి చెప్పానన్నారు. ఎన్టీఆర్ కుటుంబంతో సంబంధాన్ని కుదుర్చుకోవడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు.

పెళ్లి కుదిరిన సందర్భంలో ఎన్టీఆర్‌ను ఓ కోరిక కోరానని బాబు తెలిపారు. మీరు డబ్బులేమీ ఇవ్వొద్దు కానీ.. పెళ్లి మాత్రం ఘనంగా జరపాలని కోరానని చంద్రబాబు చెప్పారు. చిత్తూరు జిల్లాలోని ప్రతి ఇంటికి శుభలేఖ పంపించామన్నారు. దీంతో తమ పెళ్లికి ఊహించిన దాని కంటే భారీ సంఖ్యలో జనం వచ్చారని చెప్పారు. ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలకు చెందిన ప్రముఖులు, సినీ ప్రముఖులు హాజరయ్యారని తెలిపారు. మనుషులను క్షుణ్నంగా అధ్యయనం చేయడంలో ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా అని చంద్రబాబు చెప్పారు. ఆయన అభిమానులకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారని, వారితో ఏకాంతంగా మాట్లాడటం కోసం నన్ను కూడా ఎన్టీఆర్ బయటకు పంపేవారని తెలిపారు. మనుషుల్లో ఉండే పాజిటివ్ పాయింట్లను ఎన్టీఆర్ గుర్తిస్తారన్నారు. ఎన్టీఆర్‌ను పార్టీ పెట్టాలని తాను సూచించానని.. కానీ తనను ఆరంభంలోనే పార్టీలోకి తీసుకోవడానికి ఎన్టీఆర్ అంగీకరించలేదని బాబు చెప్పారు. ఎన్టీఆర్ గెలిచిన తర్వాత రాజకీయాలు మానేసి వ్యాపారవేత్తగా మారదామని అనుకున్నానని బాబు తెలిపారు. కానీ ఆగష్టు సంక్షోభం తర్వాత రాజకీయాల వైపు చూడాల్సి వచ్చిందన్నారు. అయితే 1995వ సంవత్సరంలో కొన్ని దుష్టశక్తుల కారణంగా.. పార్టీని కాపాడుకోవాల్సి వచ్చిందనీ.. అందుకోసం ఆయనకే ఎదురు తిరగాల్సి వచ్చిందని చంద్రబాబు వాపోయారు. ఆనాడు తాను లేకుంటే.. ఇప్పుడు టీడీపీ ఉండేది కాదనీ ఆయన చెప్పుకొచ్చారు. తన జీవితంలో మర్చిపోలేని ఘటన అదనీ.. ఆయనకు తొలిసారి ఎదురు చెప్పిన సంఘటన కూడా అదేనన్నారు. 

మరిన్ని స్పెషల్ వార్తల కొరకు మా స్పెషల్ పేజీ ని వీక్షించండి!

Special News