Skip to main content
Latest News

సమావేశంలో చేతికి కట్టుతో చంద్రబాబు.. టెన్షన్ పడి ఆరా తీసిన నేతలు

వైసీపీ సర్కార్ రెండు నెలల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికీ టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని.. నెల్లూరులో ముగ్గురు టీడీపీ నేతల ఇళ్లను కూల్చేరన్నారు. ఇలాంటి అరాచకాలను ఎప్పుడూ చూడలేదు ఇప్పటికి టీడీపీపై 469 దాడులు జరిగాయన్నారు. కొందరిపై తప్పుడు కేసులు పెట్టారు.. కొందరితో ఆస్తులు బలవంతంగా రాయించుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని.. చాలామంది టీడీపీ సానుభూతిపరులు గ్రామాలు వదిలిపెట్టి వెళ్లే పరిస్థితి ఉందన్నారు. అమరావతిలో మంగళవారం టీడీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. చంద్రబాబు చేతికి స్వల్ప గాయం కాగా.. చేతికి కట్టుతోనే ఈ సమావేశానికి ఆయన హాజరయ్యారు. చంద్రబాబు చేతికి కట్టు ఉండటంతో నేతలంతా.. ఆయనకు ఏమయ్యిందా...? అని ఆరా తీశారు. చేతినరంపై ఒత్తిడి పెరగడంతో వైద్యులు కట్టుకట్టినట్లు తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు పెద్ద సంఖ్యలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాబు.. వైసీపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. 

ఉచిత ఇసుకను అమలు చేస్తే ఎన్నో విమర్శలు చేశారని, ఇప్పుడు అధిక ధరకు విక్రయిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. దీనిని బట్టి ఇసుక దోపిడీకి ఎవరు పాల్పడ్డారో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.‘‘ పేదవాడికి రూ.5 కే అన్నం పెట్టే ‘అన్న’ క్యాంటీన్లను మూసేశారు. అనేక సంక్షేమ పథకాలు రద్దు చేశారు. వీటన్నిటిపైనా పోరాడేందుకు కార్యాచరణ రూపొందించుకుందాం’’ అని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. గోదావరి నీటిని తెలంగాణ భూభాగంలోకి తీసుకెళ్లి అక్కడి నుంచి శ్రీశైలానికి తెస్తామనడం అన్యాయమని చంద్రబాబు ఆరోపించారు. జగన్‌- కేసీఆర్‌ ఆంధ్రాకు అన్యాయం చేసేలా ఆలోచిస్తున్నారని అన్నారు. మన భూభాగం నుంచే నీటిని తీసుకెళ్లే ప్రాజెక్టులకు ఆలోచనలు చేయాలని, 450 కిలోమీటర్లు నీటిని తీసుకుపోవడం ప్రజల సెంటిమెంట్‌కు సంబంధించిన విషయమని అన్నారు. ఇది ఇద్దరు ముఖ్యమంత్రులు అనుకొని చేసే కార్యక్రమం కాదని చంద్రబాబు మండిపడ్డారు. స్వార్థ నిర్ణయాలతో రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయొద్దని హితవు పలికారు.

అసెంబ్లీలో మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వడం లేదని.. ప్రజా వేదిక కావాలని కోరితే తనపై కక్షతో కూలగొట్టారని చంద్రబాబు ఆరోపించారు. బెదిరిస్తే భయపడిపోతారన్న భ్రమలో ఉన్నారని.. ఏ రాష్ట్రంలో జరగని విధంగా అసెంబ్లీని దారుణంగా నడిపిస్తున్నారని.. తాము 150మంది సభ్యులం ఉన్నామని బెదిరిస్తున్నారన్నారన్నారు. చివరికి వాకౌట్ చేస్తున్నామని చెప్పడానికి కూడా మైక్ ఇవ్వడం లేదని.. అభివృద్ది పక్కన పెట్టి టీడీపీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. టీడీపీ కోన్‌ కిస్కా గొట్టంగాళ్లకు భయపడొద్దని స్పీకర్ తమ్మినేని అన్నారని.. ఆయన స్పీకర్‌ స్థాయిని దిగజార్చొద్దన్నారు. సీతారాం హుందాగా మాట్లాడాలన్నారు. వైసీపీ అరాచకాలు చూసి ప్రజలందరూ తిరుగుబాటు చేస్తే తోకముడవడం గ్యారంటీ అన్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఆటలు సాగనివ్వమని.. ఇప్పటిదాకా ఊరుకున్నాం.. ఇక ఊరుకోబోమంటూ హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో జీవించే హక్కు లేదా.. ఎందుకు వైసీపీకి అంత గర్వమని ప్రశ్నించారు. వైసీపీ ఇలాగే వ్యవహరిస్తే రాష్ట్రం దెబ్బ తింటుందన్నారు. 

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online