Skip to main content
Latest News

‘రెండు నెలల్లో 19 కేసులు పెట్టించారు.. 144 సెక్షన్ విధించడమేంటి..?’

కోడెల శివప్రసాదరావును ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టారని, ఆయన వీరోచితంగా పోరాడినా ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెల ఫర్నీచర్ తీసుకెళ్లడంపై మాట్లాడిన బాబు.. ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం నగదు రూపంలో గానీ, ఫర్నిచర్ గానీ ఇవ్వడం ఆనవాయితీ అని, స్పీకర్‌గా ఉన్న ఆయనకు కూడా ఫర్నీచర్ ఇచ్చారని వెల్లడించారు. అయినా కూడా.. కోడెల ఫర్నీచర్ కోసం జూన్ 9న లేఖ రాసి, ఆ తర్వాత పదే పదే సామాగ్రి గానీ, డబ్బులు చెల్లిస్తానని చెప్పారని గుర్తు చేశారు. దీనిపై ఆగస్టు 20న స్పీకర్ కూడా లేఖ తీసుకున్నారని అన్నారు. వాస్తవానికి, గతంలో చాలా పనులు ఉండటం వల్ల తాను ఈ కేసు వివరాల్లోకి వెళ్లలేదని.. నరసరావుపేట ఎమ్మెల్యే 22న కంప్లైంట్ చేయడం.. ఆ తర్వాత 24న అసెంబ్లీ కార్యదర్శి ఫిర్యాదు చేశారని చంద్రబాబు అన్నారు. ఫర్నీచర్ గురించి కోడెల లేఖలు రాసినా.. రూ. 1 లక్ష, లక్షన్నర ఖరీదు చేసే ఫర్నీచర్ కోసం సెక్షన్ 409 కింద 10 ఏళ్ల జైలు శిక్ష పడేలా కేసు పెట్టారని విమర్శించారు. వైసీపీ నేతలు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నా సీఎం జగన్ మౌనంగా ఉన్నారని ఆరోపించారు. ఘటనపై ప్రజలకు వివరణ ఇవ్వకపోతే వారి ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు

‘చిన్న కేసులకు జీవిత ఖైదు సెక్షన్లు మోపుతారా..? లక్ష రూపాయల ఫర్నిచర్‌ మాయం కేసులో మాజీ స్పీకర్‌పై జీవితకాలపు శిక్ష పడే సెక్షన్లు ఎలా నమోదు చేస్తారు? దీనికే జీవిత కాలం శిక్షయితే రూ.43 వేల కోట్లు దోచుకుని సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న వారిపై ఏ సెక్షన్లు పెట్టాలి. ఒక సైకో ముఖ్యమంత్రి పాలనలో పోలీసులు తమ విధులు మరచిపోతున్నారు. మా పాలనలో పోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తే.. ఇప్పుడు కేవలం తప్పుడు కేసులు పెట్టడానికే వారు పరిమితమయ్యారు. ఒక్క కోడెలపైనే కాదు.. రాష్ట్రంలో ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలు, సోషల్‌ మీడియా వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు’ అని చంద్రబాబు విరుచుకుపడ్డారు.

‘రెండు నెలల్లో 19 అక్రమ కేసులు పెట్టించారు. స్టేషన్‌ బెయిలు కోసం కోడెల న్యాయవాదులు వెళ్తే.. స్థానిక పోలీసులు ఇష్టానుసారంగా దూషించారు.. డీఎస్పీ వద్దకు వెళితే బూతులు తిట్టారు.. ఎస్పీ కూడా స్పందించలేదు.. తానేమీ చేయలేనని డీజీపీ నిస్సహాయత వ్యక్తం చేశారు.. బెట్టింగ్‌ కేసులు ఉన్న రంజీ క్రికెటర్‌ నాగరాజుతో, రైల్వేల్లో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి మోసం చేశారని, ఒకటింపావు సెంటు భూమి తగాదాలో కందుకూరి బుచ్చి వెంకాయమ్మ చేత, రవి అనే వ్యక్తిచేత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కోడెల కుటుంబ సభ్యులపై పెట్టించారు. ఇటీవల జగన్‌ బాబాయి చనిపోతే, ఆయన మృతదేహాన్ని చూసింది మీకు సంబంధించినవారు కాదా? రక్తపు మరకలు కడిగివేసింది మీవారు కాదా? బ్యాండేజీ కట్టింది మీ మామ కాదా?’.. అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెలను కడసారి కూడా అభిమానులు చూసుకోకుండా 144 సెక్షన్ విధించడం దారుణమని ఆయన వాపోయారు. జగన్ సర్కారు రాక్షస పాలనకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని చంద్రబాబు ప్రశ్నించారు. 

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online