Skip to main content
Latest News

చివరి కోరిక తీరకుండానే.. కన్నుమూసిన వేణుమాధవ్..

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ ఇకలేరు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న వేణుమాధవ్.. సికింద్రాబాద్‌లోకి యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందతూ తుదిశ్వాస విడిచారు. వేణుమాధవ్ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. వేణుమాధవ్ మరణంపై చంద్రబాబు స్పందించారు. టీడీపీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ‘మిమిక్రీ కళాకారుడిగా, సినీ హాస్య నటుడిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసిన వేణుమాధవ్ మృతి విచారకరం. తెదేపా ఎన్నికల ప్రచారంలోనూ తనదైన ప్రత్యేకతతో ప్రజలని ఆకట్టుకున్నారు. వేణుమాధవ్ మృతికి నివాళులర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను..’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. 

గుంటూరు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు.. వేణుమాధవ్ మరణం గురించి తెలియడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేణు మరణం టాలీవుడ్‌కు తీరని లోటన్నారు. వేణుమాధవ్ టీడీపీ, ఎన్టీఆర్‌ను ఎంతో అభిమానించేవారని.. మహానాడులో మిమిక్రీ ప్రదర్శన ద్వారా ఎన్టీఆర్‌ను ఆకట్టుకున్నారని.. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అంతేకాదు మహానాడు ప్రదర్శనలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వేణుమాధవ్ అద్భుతంగా చెప్పేవారట. సభ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ వేణుమాధవ్‌ను ప్రశంసించారట.

సినిమాలంటే పిచ్చితో హైదరాబాద్‌కు వచ్చిన వేణుమాధవ్.. మొదట్లో టీడీపీలో టెలిఫోన్ ఆపరేటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత సినిమా ప్రయత్నాలను మొదలుపెట్టిన సక్సెస్ అయ్యారు. దాదాపు 600లకు పైగా సినిమాల్లో హాస్యం పండించాడు. ఎంత మంది కమెడియన్స్ ఉన్న వేణుమాధవ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉండేది. ఏ సినిమాలో నటించిన పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగలిగే నటుడు వేణుమాధవ్. తాను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండి ఆదుకుని ఉపాధినిచ్చిన టీడీపీ అంటే వేణుమాధవ్‌కు ఎంతగానో అభిమానం. అందుకే ఆ పార్టీ ద్వారా ఒక్కసారయినా ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలన్నది ఆయన కల. ఈ విషయాన్ని వేణుమాధవ్ కూడా పలుమార్లు మీడియా ముందు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా పలుమార్లు దీనిగురించి విన్నపాలు చేశారు. అయితే అనివార్య పరిస్థితుల వల్ల చంద్రబాబు 2013లో తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కోదాడ ఎమ్మెల్యే టికెట్‌ను ఇవ్వలేకపోయారు. దీంతో వేణుమాధవ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయినప్పటికీ సరైన వివరాలు లేకపోవడంతో ఆ నామినేషన్ రిజెక్ట్ అయింది. ఆ తర్వాత వేణుమాధవ్ ఆరోగ్యం క్షీణించడంతో రాజకీయాలకు, సినిమాలకు దూరంగా ఉన్నారు. చివరికి వేణుమాధవ్ రాజకీయాలల్లో ఒక్కసారైనా ఎమ్మెల్యేగా రాణించాలనే  తన కోరిక తీరకుండానే కన్నుమూశారు.

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online