Skip to main content
Latest News

‘మా ఇంటికి పనోళ్లనూ రానియ్యరా..? జగన్ క్యారెక్టర్‌కు ఇదే ప్రత్యక్ష్య సాక్ష్యం’

‘చలో ఆత్మకూరు’కు పిలుపునిచ్చిన చంద్రబాబు పల్నాడు వెళ్లకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ గృహ నిర్బంధం నుంచి బయటకొచ్చిన చంద్రబాబు.. తన వాహనంలో ఆత్మకూరు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఛలోఆత్మకూరు ఆగదన్న చంద్రబాబు... అక్కడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆయనను అడ్డుకునేందకు ఇంటి బయట పోలీసులు భారీగా మోహరించారు. చంద్రబాబు కారు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఉండవల్లిలో ఆయన ఇంటి గేటుకు తాళ్లు కట్టారు. గేటు తెరిచేందుకు వీలు లేకుండా బయట నుంచి లావైన తాళ్లతో కట్టి.. గేటును మూసివేశారు. ఇంటి బయట కూడా భారీగా పోలీసులు మోహరించారు. దీంతో చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అంటూ టీడీపీ కార్యకర్తలు, నేతలు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. మాకు న్యాయం చేయాలంటూ స్లోగన్స్ అందుకున్నారు. 

అంతకు ముందు చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. బాధితులు వాళ్ల సొంత ఊళ్లకు వెళ్లేలా చూడాలని 9 రోజుల గడువు ఇచ్చినా.. ప్రభుత్వం, డీజీపీ స్పందించలేదన్నారు. అందుకే తాను స్వయంగా ఆత్మకూరు వెళ్లడానికి పిలుపునిచ్చానని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నన్ను ఇంట్లోనే నిర్భంధించారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన నాయకులను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారని బాబు ఆరోపించారు. అచ్చెన్నాయుడిని ఒక పోలీసు స్టేషన్ నుంచి మరో పోలీసు స్టేషన్‌కు తిప్పారన్నారు. మా ఇంటికి పని వాళ్లను సైతం రాకుండా అడ్డుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న బాధితులకు భోజనం కూడా పంపకుండా అడ్డుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని బాబు ఆరోపించారు. పరిపాలిస్తోన్న వ్యక్తి క్యారెక్టర్‌కు ఇది అద్దం పడుతుందని.. సీఎం జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. నన్ను ఇంట్లో పెడితే మీరు ఆపలేరు. మా నాయకులను ఇంట్లో నిర్బంధిస్తే ఆపలేరు. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తే ఆపలేరని చంద్రబాబు ఆవేశంగా మాట్లాడారు. చలో ఆత్మకూరు నిరంతరం ఉంటుందని స్పష్ట చేశారు. మీరు ఎప్పుడు వదిలిపెడితే అప్పుడు నేరుగా బాధితులను తీసుకొని ఆత్మకూరు వెళ్తానని పోలీసులకు తెలిపారు. డీజీపీగానీ, పోలీసులు గానీ ఎవరేం చేస్తారో చేసుకోండి. వాళ్ళ ఊళ్లలో వాళ్లు నివసించే హక్కు కల్పించేంత వరకు ఈ పోరాటం ఆగదని చంద్రబాబు స్పష్టం చేశారు.

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online