Skip to main content
Latest News

మోదీకి జగన్ ఫిర్యాదు చేసిన రెండేళ్లకు.. ఈడీ మాజీ అధికారి ఇంటిపై సీబీఐ దాడులు

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మాజీ అధికారి, జీఎస్టీ ప్రస్తుతసూపరింటెండెంట్‌ బొల్లినేని శ్రీనివాస గాంధీ ఇంటిపై సీబీఐ దాడులు చేసింది. ఆయన అక్రమ ఆస్తుల గుట్టును కేంద్ర దర్యాప్తు సంస్థ రట్టుచేసింది. ఆయన ఆదాయానికి మించి విచ్చలవిడిగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. బీఎస్‌ గాంధీ ఆస్తులు అనూహ్యంగా పెరిగాయని, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. సుజనాచౌదరి కేసులనూ ఆయన నీరుగార్చారని కొంతకాలంగా ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో సీబీఐ అధికారులు హైదరాబాద్, విజయవాడ తదితర చోట్ల గాంధీ నివాసాలు, కార్యాలయంపై మంగళవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిపి సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

నివాస గాంధీతోపాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట తెలుగు రాష్ట్రాల్లో రూ.3.75కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులున్నట్లు ప్రా థమికంగా గుర్తించారు. విజయవాడలోని కానూరు, కంకిపాడు, కడప జిల్లా ప్రొద్దుటూరు, హైదరాబాద్‌లోని కొండాపూర్‌, కూకట్‌పల్లి, మదీనాగూడతోపాటు... గుండాల, పెద్దపులిపాక, యంకపెద్ది, తరిగొప్పుల, మందడం తదితర ప్రాంతాల్లో శ్రీనివాస గాంధీకి ఇళ్లు, ఇంటి స్థలాలు, పొలాలు ఉన్నట్లు సీబీఐ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఒక వోక్స్‌ వ్యాగన్‌ కారు, బ్యాంకు బ్యాలెన్స్‌తో మొత్తం కలిపి మొత్తం రూ. 3.75 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు తెలిపారు.  శ్రీనివాసగాంధీ ప్రస్తుతం హైదరాబాద్‌ జీఎస్టీ కమిషనరేట్‌లో పన్ను ఎగవేతల నిరోధక విభాగం సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. ఆయన 2010 జనవరి నుంచి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్‌ 13(2) రెడ్‌ విత్‌13(1)(బీ), 109 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

బొల్లినేని శ్రీనివాస గాంధీ 1992 ఏప్రిల్‌ 27న సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా చేరారు. 2002లో సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొంది హైదరాబాద్‌ కమిషనరేట్‌–1లో పోస్టింగ్‌ పొందారు. 2003లో డిప్యుటేషన్‌పై డీఆర్‌ఐ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌)కి వెళ్లారు. అక్కడి నుంచి 2004లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి వెళ్లి, 2017 వరకు అక్కడే ఉన్నారు. ఆ తరువాత జీఎస్‌టీకి బదిలీ అయ్యారు. ఈ క్రమంలోనే జగన్‌ అక్రమాస్తుల కేసుల దర్యాప్తులో కీలక పాత్ర పోషించారు. సుజనాచౌదరి కేసు కూడా ద ర్యాప్తు చేశారు. శ్రీనివాసగాంధీతోపాటు ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ ఉమాశంకర్‌ గౌడ్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు ప్రోద్బలంతో కావాలనే ఇబ్బంది పెడుతున్నారని 2017లో విపక్షనేతగా ఉన్న ప్రస్తుత సీఎం జగన్‌ ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ సూచనల మేరకే తమ ఆస్తుల జప్తు విషయంలో ముందుకెళ్లారని ఆరోపించారు. దీంతోపాటు శ్రీనివాసగాంధీపై కేంద్ర ఆర్థికశాఖకు, పీఎంవోకి, సీబీఐకి అనేక ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన్ని కేంద్రం ఈడీ నుంచి జీఎస్టీకి బదిలీ చేసింది. తొలుత బేగంబజార్‌ డివిజన్‌ అధికారిగా నియమించి... తర్వాత కొద్దికాలానికే జీఎస్టీ హైదరాబాద్‌ ప్రధాన కార్యాలయంలోని యాంటీ ఎవేజన్‌ వింగ్‌కు బదిలీ చేశారు.

మరిన్ని రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి!