Skip to main content
Latest News

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై కేసు నమోదు.. పత్రిక అధినేత ఫిర్యాదుతోనే..

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే సహా మరో ఆరుగురిపై కేసు నమోదయింది. జమీన్ రైతు వారపత్రిక అధినేత డోలేంద్ర ప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఓ వార్త రాసినందుకు గానూ.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాగి వచ్చి.. తనపై దాడిచేసి కొట్టారంటూ ‘జమీన్‌ రైతు’ వారపత్రిక ఎడిటర్‌ డోలేంద్ర ప్రసాద్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. నెల్లూరులో ఆదివారం రాత్రి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ.. దాడికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆదివారం రాత్రి 7.30 గంటలకు కోటంరెడ్డి మాగుంట లేవుట్‌లో ఉన్న తన ఇంటికి పూటుగా మందుతాగి వచ్చారని డోలేంద్ర వివరించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సొంత ఊరికి చెందిన డాక్టర్‌ వసుంధర, తనతో మాట్లాడి బయటకు వస్తున్న సమయంలో.. ఎమ్మెల్యే ఆమె చేయిపట్టుకుని మళ్లీ ఇంట్లోకి తీసుకువచ్చారని చెప్పారు. 

వస్తూనే ‘‘ఏరా నేను అరాచక శక్తినంటూ.. నాపై అరపేజీ వార్త రాస్తావా? ఇక్కడికిక్కడే నిన్ను చంపేస్తా.. మూడు పేజీల వార్త రాసుకో.. నేను అధికార పార్టీ ఎమ్మెల్యేని.. నన్నెవరూ ఏమీ పీకలేరు. ఎవరితో చెప్పుకుంటావ్‌ చెప్పుకో.. ఎస్పీతోనా, మంత్రితోనా, జగన్‌తోనా ఎవ్వరితోనైనా చెప్పుకో.. నన్ను ఎవ్వరూ ఏమీ పీకలేరు’ అంటూ.. కోటంరెడ్డి తనను బెదిరించారని డోలేంద్ర ప్రసాద్ వాపోయారు. ఇంటివద్దకు వచ్చి రచ్చచేయడం ఏమిటని తాను ప్రశ్నించటంతో వెంటనే ఎమ్మెల్యే కోటంరెడ్డి తనను కొట్టారని డోలేంద్ర చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే వెంట ఉన్న పీఏ మురళి సహా మరికొందరు కూడా తనపై దాడి చేశారని తెలిపారు. మీడియా సమావేశం ముగిసిన తర్వాత.. ఆయన నేరుగా పోలీసులకు ఫిర్యదు చేశారు. దాడికి సంబంధించిన వారిపై కేసు నమోదు చేయాలని కోరారు. ఇది కాస్తా కలకలం రేపడంతో.. పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. కోటంరెడ్డితో సహా మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. 

మర్రిని రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 
Telugu News Online