Skip to main content
Latest News

బోటును తీస్తే.. అదో చరిత్రే.. ఇంకా దొరకని 13 మంది ఆచూకీ..

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగి పెనువిషాదానికి కారణమైన బోటు ఆచూకీ ఎట్టకేలకు గుర్తించిన విషయం తెలిసిందే. నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. వందలాది మంది నాలుగు రోజులపాటు తీవ్రంగా శ్రమించి బోటు 315 అడుగుల లోతులో ఉందని గుర్తించారు. ఉత్తరాఖండ్‌ విపత్తు నిర్వహణ దళం తమ దగ్గరున్న అధునాతన సోనార్‌ వ్యవస్థ సాయంతో రెండు రోజులపాటు గాలించింది. బుధవారం బోటు ఆచూకీ కనిపెట్టగలిగింది. అయితే, దీని ఆచూకీ తేల్చడం కంటే బయటకు తీయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ అని నిపుణులు పేర్కొంటున్నారు. పడవలో మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ బోటును వెలికి తీయడం తమ వల్ల కాదని భారత నేవీ వర్గాలంటున్నాయి. ఇలాంటి ఆపరేషన్లలో సిద్ధహస్తుడిగా పేరుగాంచిన నేవీ అధికారి దశరథ్ సైతం ఇది అసాధ్యం అంటూ తేల్చేస్తున్నారు.

మహాలోతైన సముద్రాలను, బలిమెల ఘటనలను, ఇతర సరస్సుల్లో మునిగిన బోట్లను బయటకు తీసిన వాళ్లు కూడా.. కచ్చులూరు వద్ద మునిగిన బోటు విషయంలో మాత్రం చేతులెత్తేస్తున్నారు. దేశం నలుమూలల నుంచి ఎందరో ప్రావీణ్యత కలిగిన నిపుణులు భిన్నమైన సాంకేతిక పరిజ్ఞానాలతో ఘటనా స్థలానికి చేరుకుని బోటును చూచాయగా గుర్తించినా దాన్ని బయటకు తీయడంపైనే ఎవరూ స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. గతంలో దేశంలో ఎక్కడ ఎన్ని ఘోర ప్రమాదాలు జరిగినా, ఇంతకు మించి లోతుల్లో చిక్కుకున్న బోట్లను, పెద్ద నావలను సైతం బయటకు తీయగలిగిన పరిస్థితులకు... కచ్చులూరు వద్ద చోటు చేసుకున్న పరిస్థితులకు పొంతన కుదరడం లేదు.

బోటులో నుంచి గల్లంతైన వారందరూ ప్రాణాలతోనో లేక విగత జీవులుగానో లభ్యమైతే లెక్కలకు సరిపోతే ఇక బోటును అన్వేషించే సమస్యే ఉండదు. అధికారుల లెక్కల ప్రకారం బోటులో 73మంది ఉంటే అందులో 26మంది సురక్షితంగా బయటపడగా, గల్లంతైన 47మందిలో 34మంది విగత జీవులుగా దొరికారు. ఇంకా 13మంది ఆచూకీ లభించలేదు. రోజురోజుకూ మృతదేహాలు కూడా బయట పడుతుండడంతో తక్కినవారు కూడా విగత జీవులుగా ఏమైనా బయటపడతారేమోనని భావిస్తున్నారు. అదే జరిగితే బోటును బయటకు తీయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. బోటులో ఎవరైనా చిక్కుకుని ఉంటారన్న అనుమానంతోనే బోటును తీయాలన్న ఆలోచన వస్తోంది. బోటులో ఎవరూ లేరని నిర్ధారించుకుంటే మాత్రం బయటకు తీసే యోచనే వదిలేయవచ్చు.

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online