Skip to main content
Latest News

కోడెల అంతిమయాత్రలో బాలయ్య.. పంటిబిగువున బాధను భరిస్తూనే..

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌‌ అంతిమయాత్రతో నరసారావుపేట శోక సముద్రంలో మునిగిపోయింది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, పార్టీ వర్గాలు, ప్రజలు ఆయన అంతిమయాత్రలో భాగమయ్యారు. ఆయన మరణవార్తతో కుటుంబసభ్యులతో పాటు.. అంతే సమానంగా.. బాలకృష్ణ బాధపడినట్లు తెలుస్తోంది.. తన ఆత్మీయుడు ఇక లేరన్న విషాధం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన కోడెల.. అప్పుడు ఆయనతోనూ.. ఆ తర్వాత బాలయ్యతోనూ చాలా సన్నిహితంగా మెలిగారు. బసవతారకం ఆస్పత్రి ఇప్పుడు ఈ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిందంటే.. దానికి ప్రధాన కారణం కోడెలేనని వేరుగా చెప్పనక్కర్లేదు. వారి మధ్య అనుబంధం మరింత పెరగడంలో బసవతారకం ఆస్పత్రి పాత్రే ప్రముఖమడనంలో ఏమాత్రం సందేహం లేదు. కోడెల మరణవార్త తెలిసిన వెంటనే.. బాలయ్య దుఃఖం ఆపుకోలేక పోయారు. కోడెల మరణించినప్పటినుంచి.. అటు ఆస్పత్రిలోనూ.. ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లోనూ.. ఆ తర్వాత స్వస్థలానికి తరలించే సమయంలోనూ.. అంత్యక్రియల్లోనూ.. ఆద్యంతం బాలయ్య దగ్గరుండి చూసుకున్నారు. 

టీడీపీ పార్టీతో కోడెల అనుబంధం ఈ నాటిది కాదు. ఎన్టీఆర్ కాలం నుంచి తన తుదిశ్వాస విడిచే వరకు టీడీపీ పార్టీ వెన్నంటే ఉన్నారు కోడెల శివప్రసాద్. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీతో కోడెలకు మంచి అనుబంధం ఉండేది. ఈ నేపథ్యంలో పార్టీ వర్గాలు, నందమూరి ఫ్యామిలీ సభ్యులు కోడెల మరణంతో శోక సముద్రంలో మునిగిపోయారు. బసవతారకం ఆస్పత్రి ప్రారంభించినపుడు ఆయనే ఫౌండర్ ఛైర్మెన్ అని గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందారు బాలకృష్ణ. అప్పట్లో అమ్మగారి జ్ఞాపకార్థం నాన్నగారు ఆస్పత్రి నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నపుడు కోడెల ముందడుగు వేసి మంచి సహకారం అందించారని బాలకృష్ణ తెలిపారు. రాజకీయ నాయకుడిగానే గాక వైద్యుడిగా కూడా ఎన్నో సేవలందించిన కోడెలను తెలుగు ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని బాలకృష్ణ అన్నారు. 

బాలకృష్ణ హీరోగా బీ గోపాల్ దర్శకత్వంలో వచ్చిన పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాను ఎక్కువ భాగం కోడెల శివప్రసాద్ ఇంట్లోనే షూటింగ్ చేశారు. బాలకృష్ణతో కోడెల ప్రత్యేక సంబంధాలు కలిగి ఉండేవారు. సోమవారం రాత్రే ఎన్టీఆర్ ట్రస్ట్ భవనకు వచ్చి కోడెల మృత దేహానికి ఘన నివాళి అందించిన బాలకృష్ణ.. కోడెల మరణం పొందిన ఈ రోజు ఓ దుర్దినం అని అన్నారు. ఆయన మరణించారనే వార్త జీర్ణించుకోలేక పోతున్నామని చెప్పారు. ఆయన అంతిమయాత్రలోనూ తీవ్ర భావోద్వేగంతో కనిపించారు బాలకృష్ణ. ఓ వైపు అభిమానులంతా కేకలు వేస్తూ జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తున్నా.. పంటిబిగువున్న దు:ఖాన్ని భరిస్తూనే.. వారికి అభివాదాలు చేశారు. ఆ సమయంలో ఆయన పడుతున్న బాధేంటో.. ఆయన కళ్లల్లో కనిపించింది. అంతిమయాత్రలో పార్థీవదేహం పక్కనే.. వ్యానులోనే ఉండి.. కడసారి కోడెలకు బాలయ్య వీడ్కోలు పలికారు. 

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online