Skip to main content
Latest News

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు.. కేంద్రం అనూహ్య నిర్ణయం!

గతంలో చంద్రబాబు, కేసీఆర్ ఎన్నోసార్లు అడిగినా నో చెప్పిన కేంద్రం.. ఇప్పుడు అనూహ్య నిర్ణయం తీసుకుందాం..? ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపునకు మోదీ సర్కారు అడుగులు వేస్తోందా..? జమ్మూ కశ్మీర్‌ విభజనతో అసెంబ్లీ సీట్లను కూడా పునర్వ్యవస్థీకరణ అవసరం రావడంతో.. ఏపీ, తెలంగాణలో కూడా సీట్ల పెంపునకు కేంద్రం వ్యూహరచన చేస్తోందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. జమ్మూ కశ్మీర్‌ రాష్ట్ర విభజన చట్టంలో ఆ రాష్ట్రంలో 7 సీట్లను పెంచాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు మంగళవారం అధికారులతో అంతర్గత సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టంలోనూ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాలని ఉన్నందున ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల సీట్ల పెంపు అంశం చర్చకొచ్చినట్లు తెలిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సిక్కింలో కూడా అసెంబ్లీ సీట్లను పెంచాల్సి ఉంది. ఈ నాలుగు రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టడానికి పరిశీలన జరుగుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. 

‘‘జమ్మూ కశ్మీర్‌ విభజన చట్టంలో అసెంబ్లీ సీట్ల పునర్వ్యవస్థీకరణ నిబంధనల గురించి ఎన్నికల కమిషన్‌ సభ్యులకు తెలియజేశాం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడిన సమయంలో రెండు రాష్ట్రాల మధ్య అసెంబ్లీ సీట్లను పంచేందుకు అవలంబించిన ప్రక్రియ గురించి వివరించాం’’ అని సమావేశంలో పాల్గొన్న ఓ అధికారి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపునకు రాజ్యాంగంలోని 170వ అధికరణ సవరించాలని గతంలో ప్రభుత్వానికి అటార్నీ జనరల్‌ సూచించారు. కాగా.. ఏపీ విభజన చట్టం సెక్షన్‌ 26 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రతి పార్లమెంటు స్థానం పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలను పెంచాల్సి ఉంది. దీని ప్రకారం ఏపీలో 50, తెలంగాణలో 34 అసెంబ్లీ సీట్లు పెరగాలి. అయితే ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170కి లోబడే జరగాలనే నిబంధనను అందులో పొందుపరిచారు. సంక్లిష్టతతో కూడుకున్న కావడంతో గతంలో ఎన్డీయే భాగస్వామిగా ఉన్న చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు సీట్ల పెంపుపై పలుసార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఇది ముగిసిన అధ్యాయమే అనుకున్నారు. తాజాగా మరోసారి ఈ అంశం తెరపైకి రావడంతో.. అసెంబ్లీ సీట్లు పెరగడం ఖాయంగానే కనిపిస్తోంది.

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online