Skip to main content
Latest News

ఇస్రో ఉద్యోగులను కలవరపెడుతున్న కేంద్రం కొత్త నిర్ణయం..!

ఎన్నో ఆశలతో నిర్వహించిన చంద్రయాన్-2 ప్రయోగం.. కాస్త నిరాశకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఒక్క నిమిషంలో ప్రయోగం పూర్తయి.. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగుతుందనగా.. సిగ్నల్ కట్ అవడం.. ల్యాండర్ చంద్రుడిపై బోల్తా పడటం జరిగిందని శాస్త్రవేత్తలు చెప్పారు. మొదట్లో అసలు విక్రమ్ ల్యాండర్ ఎక్కడ ఉందన్నదానిపై క్లారిటీ లేదు. తర్వాత్తర్వాత విక్రమ్ ల్యాండర్ సేఫ్‌గానే ఉందనీ.. ముక్కలవలేదనీ.. సిగ్నల్స్ కోసం ప్రయత్నిస్తున్నామని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ఆ ప్రయోగంపై కాస్త ఆశలు చిగుర్చాయి. వేలాది మంది శాస్త్రవేత్తలకు కాస్త ఊరట లభించింది. కాగా దేశ వ్యాప్తంగా ఇస్రో శాస్త్రవేత్తలను అభినిందిస్తోంటే.. వారిని మాత్రం ఓ వార్త కలవరపెడుతోంది. వారి జీతాల్లోనుంచి కోత విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది...

ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల వేతనాల్లో కోత విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జూన్‌ 12న విడుదల చేయగా, జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రభావంతో 90 శాతం మంది ఇస్రో ఉద్యోగుల వేతనాలు సగటున రూ.10వేల మేర తగ్గనున్నాయి. పెద్ద పెద్ద జీతాలు పొందుతున్న వారికి రూ.10వేల కోత పెద్ద విషయమేమీ కాకున్నా.. చిన్న జీతాలు తీసుకుంటున్న వారికి రూ.1000 కోత విధించినా.. కష్టంగానే ఉంటుంది. దీంతో ఇస్రో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, కేంద్రం చర్యను ఇస్రోలోని స్పేస్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్ ‌(ఎస్‌ఈఏ) తీవ్రంగా ఖండించింది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించి, వేతనాల కోతలు లేకుండా చూడాలని ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌కు నివేదించింది. మరి కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. 

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online