Skip to main content
Latest News

వైసీపీ సర్కారు.. చంద్రబాబు సెక్యూరిటీని తగ్గించడంపై హైకోర్టు సంచలన తీర్పు.. 

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు భద్రత వ్యవహారంలో హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. చంద్రబాబు భద్రత విషయంలో వైసీపీ సర్కారు అవలంభించిన వైఖరికి ఎదురుదెబ్బ తగిలింది.  ఆయనకు మొత్తం 97 మంది భద్రతా సిబ్బందిని కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్లోజ్‌డ్‌ సెక్యూరిటీ ఎవరి పని అనే అంశంపై ఎన్‌ఎస్‌జీ, స్టేట్‌ సెక్యూరిటీ మధ్య నెలకొన్న అభిప్రాయ బేధాలపై మూడు నెలల్లో ఓ నిర్ణయానికి రావాలని నిర్దేశించింది. అలాగే, చంద్రబాబు కాన్వాయ్‌లో జామర్ వాహన సౌకర్యం కల్పించాలని ఆదేశించింది. చంద్రబాబుకు సీఎస్‌వోను ప్రభుత్వం నియమించవచ్చని హైకోర్టు తెలిపింది. 

తన భద్రత కుదించడాన్ని సవాల్‌ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై హైకోర్టులో ఇటీవలే వాదనలు ముగిశాయి. ఇరువైపు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు తీర్పును రిజర్వు చేశారు. తాజాగా బుధవారం ఆ కేసుపై తుది తీర్పును వెల్లడించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలకు క్రమక్రమంగా భద్రతను తగ్గిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే మొదట మంత్రులుగా పనిచేసిన వారికి.. ఆ తర్వాత సీనియర్ నేతలకు భద్రతను కుదించారు. చివరకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నచంద్రబాబుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించే భద్రతను చెప్పాపెట్టకుండానే కుదించారు. దీంతో ఆందోళన వ్యక్తం చేసిన టీడీపీ నేతలు.. హైకోర్టులో పిటిషన్ వేయాలంటూ చంద్రబాబుకు సూచించారు. ఈ నేపథ్యంలోనే ఆయన పిటిషన్ వేయడం జరిగింది. దీనిపై తుది తీర్పు బుధవారం వచ్చింది. ఒకరకంగా కోర్టులో ఏపీ సర్కారుకు ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పవచ్చు. 

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online