Skip to main content
Latest News

చంద్రబాబు హౌస్ అరెస్ట్‌పై.. క్లారిటీ ఇచ్చిన డీజీపీ సవాంగ్

పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ధర్నాలు, ప్రదర్శనలకు అనుమతిలేదని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని సూచించారు. అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలంటూ డీజీపీ విజ్ఞప్తి చేశారు. విపక్ష నేత చంద్రబాబు పర్యటనతో పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతుండడం, శాంతిభద్రతలకు భంగం కలుగుతుండడంతో ముందస్తుగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అంతేకానీ, ప్రభుత్వ విధానాలపై ఆయన పోరాడుతున్నారన్న కారణంతో అదుపులోకి తీసుకోలేదని ఆయన చెప్పారు. ఆయన్ను ఇంటి నుంచి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ మాత్రమే చేశామని వెల్లడించారు. చలో ఆత్మకూర్ నేపథ్యంలో చంద్రబాబు, లోకేశ్‌లను హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటి నుంచి వారిని బయటకు రానీయకుండా గేట్లకు తాళ్లు కట్టి మరీ ఆపేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులను మొహరించారు. చంద్రబాబు ఇంటికి చేరుకుంటున్న నేతలను, కార్యకర్తలను కూడా ఎక్కడికక్కడ ఆపేశారు. ఈ పరిణామాలపై డీజీపీ సవాంగ్ స్పందించారు. 

పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉందని, 30 పోలీస్ యాక్ట్ కూడా విధించామని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఆ ప్రాంతంలో ఎలాంటి ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రజలు వినాయక చవితి, మొహర్రం వంటి పండుగలను ప్రశాంతంగా జరుపుకుంటున్నారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని పేర్కొన్నారు. శాంతిభద్రతలు కాపాడడంలో రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలని డీజీపీ కోరారు. పల్నాడు ప్రాంతంలో అవాంఛనీయ ఘటనలు జరిగితే ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పల్నాడు ప్రాంతం తాజా రాజకీయ ప్రకంపనలతో అట్టుడుకుతోంది. తమ కార్యకర్తలపై వైసీపీ వాళ్లు దాడులకు పాల్పడుతున్నారంటూ టీడీపీ ఛలో ఆత్మకూరు కార్యక్రమం ప్రకటించగా, వైసీపీ కూడా పోటాపోటీగా వ్యవహరిస్తోంది.

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online