Skip to main content
Latest News

చంద్రబాబు ఉంటున్న లింగమనేని గెస్ట్‌హౌస్‌కు వెళ్లి ఎమ్మెల్యే ఆర్కే సంచలన కామెంట్స్

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబును కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. అందుకోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీ వరద వస్తుండటంతో చంద్రబాబు నివాసంలోకి వరద నీరు వచ్చి చేరుతోందని అన్నారు. బుధవారం ఉండవల్లిలోని లింగమనేని గెస్ట్ హౌస్‌ను సందర్శించిన అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడారు. లింగమనేని గెస్ట్ హౌస్ మునిగిపోతుందన్న భయంతోనే చంద్రబాబు హైదరాబాద్‌కు పారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. కృష్ణా వరదను ముందే ఊహించిన చంద్రబాబు వారి కుటుంబ సభ్యులకు చెందిన వాహనాలను హ్యాపీ రిసార్ట్స్‌కు తరలించారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో సరైన వర్షాలు పడక, వరదలు రాలేదు కాబట్టే చంద్రబాబుకు ఇక్కడి పరిస్థితి అర్థం కాలేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కాకపోయినా, భవిష్యత్తులో అయినా చంద్రబాబు తన అక్రమ నివాసాన్ని ఖాళీ చేయక తప్పదని ఆర్కే స్పష్టం చేశారు.

చంద్రబాబు ఉంటున్న ఇంటికి వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. ఇంట్లోకి నీరు చేరకుండా సిబ్బంది ఇసుక బస్తాలు వేస్తున్నారు. దీన్ని ఉద్దేశిస్తూ.. అక్రమ నివాసాన్ని కాపాడుకునేందుకు లారీలతో ఇసుకను తరలిస్తున్నారని ఆర్కే విమర్శించారు. ఎగువన గల పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీ వరద వస్తోందని, చంద్రబాబు నివాసంలోకి వరద నీరు వచ్చి చేరుతోందని తెలిపారు. కాగా.. పులిచింతల ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్‌లో నీటిమట్టం 12.3 అడుగులకు చేరుకుంది. 3.07 టీఎంసీల సామర్థ్యమున్న బ్యారేజీ పూర్తిగా నిండిపోయింది. ఇన్‌ఫ్లో 4.12 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 4.12 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరదలు ఇలాగే కొనసాగితే కరకట్ట పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెప్తున్నారు. దీంతో లోతట్టు ‍ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online