Skip to main content
Latest News

రోజాపై ఫేస్‌బుక్‌లో అసభ్యకర కామెంట్స్ చేసిన వ్యక్తి అరెస్ట్

నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టులు పెట్టి.. ఇప్పుడో వ్యక్తి కటకటాలు లెక్కిస్తున్నాడు. శాసనసభ్యురాలిని కించపరిచేలా పోస్టు పెట్టినందుకు ప్రకాశం జిల్లాకు చెందిన పునుగుపాటి రమేష్ అనే వ్యక్తిని తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గతనెల ఏపీ అసెంబ్లీ సమావేశాల సమయంలో మహిళా ఎమ్మెల్యేల ముందు వరుసలో కూర్చున్న సినీనటి రోజా చేసిన సైగలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఫొటోను తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు చేసిన రమేశ్‌ దానికింద ‘అసెంబ్లీని రెడ్‌లైట్‌ ఏరియాగా మార్చారు కదరా’ అనే క్యాప్షన్‌ జతచేశాడు. ఫొటో, దానికింద చేసిన విమర్శ ఎస్సీ, ఎస్టీ, ఇతర మహిళా ఎమ్మెల్యేలను కించపరిచేదిలా ఉన్నాయంటూ గతనెల 26న ఏపీ అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు గుంటూరు రూరల్‌ ఎస్పీ జయలక్ష్మికి ఫిర్యాదు చేశారు. 

శాసనసభ కార్యదర్శి ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు రమేష్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శాసనసభ్యులపై రమేష్ చేసిన వాఖ్యల ఫొటోలు, ఆయన ఫేస్‌బుక్‌ ఖాతా ఫొటోను పోలీసులకు అందజేశారు. రమేష్ కోసం గాలించి.. అతడు ఏ ప్రాంతానికి చెందిన వాడో తెలుసుకున్నారు. గతంలో అనంతపురం జిల్లాలోనూ రమేష్‌పై ఇదే తరహా కేసు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ఫేస్‌బుక్‌లో రమేష్ పోస్టింగ్‌ను అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం కూడా తీవ్రంగా పరిగణించారు. తాజాగా, రమేశ్ ఆచూకీని పోలీసులు గుర్తించారు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు న్యాయవాదితో మాట్లాడేందుకు గుంటూరు వస్తున్నాడని పోలీసులు తెలుసుకుని రైల్వే స్టేషన్ వద్ద కాపు కాశారు. రైలులోంచి దిగగానే అతనిని అరెస్ట్ చేశారు. రమేశ్‌పై రాజకీయ శక్తుల ప్రభావం లేదని ఏఎస్పీ చక్రవర్తి పేర్కొన్నారు.

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online