Skip to main content
Latest News

4వేల ప్రభుత్వ బడుల మూతకు సిద్ధమైన తెలంగాణ సర్కారు

తెలంగాణలో 4 వేలకు పైగా ప్రభుత్వ బడులు మూతపడనున్నాయి. సరిపడా విద్యార్థులు లేని బడులను మూసివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజస్థాన్‌లో 2015 నుంచి ఇప్పటి వరకు నాలుగేళ్లలో 20 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు. 30 మంది కన్నా తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను మూసివేసినట్లు మన అధికారులు గుర్తించారు. ఇక్కడ కూడా అదే ఫార్ములాను అమలు చేయనున్నారు. మూసివేసే బడుల్లో ఉన్న విద్యార్థులు, టీచర్లను ఇతర పాఠశాలలకు తరలిస్తారు. రోజూ దూరంగా ఉన్న పాఠశాలకు వచ్చే విద్యార్థులకు రవాణా చార్జీలను ప్రభుత్వం చెల్లిస్తుంది. టీచర్లను అవసరం ఉన్న పాఠశాలలకు డిప్యుటేషన్‌ మీద పంపిస్తారు. టీఆర్టీ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత బడుల మూసివేతకు శ్రీకారం చుడతారు. 

ఇప్పటికే అన్ని జిల్లాల డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. 10 మంది విద్యార్థుల లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల వివరాలను, 30 మంది లోపు ఉన్న ఉన్నత పాఠశాలల వివరాలను అందించాలని ఆదేశాలిచ్చారు. తెలంగాణలో 26,040 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 18,217 ప్రాథమిక పాఠశాలలు, 3,186 ప్రాథమికోన్నత పాఠశాలలు, 4,637 ఉన్నత పాఠశాలల ఉన్నాయి. 27.73 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. బడులను మూసివేయాలనే విద్యాశాఖ నిర్ణయంతో తెలంగాణలో సుమారు 4 వేల పాఠశాలలకు మూసివేత ముప్పు వాటిల్లనుంది. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 3500 వరకు ఉండగా, ఉన్నత పాఠశాలలు 500 వరకు ఉండే అవకాశం ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో 10 కన్నా, ఉన్నత పాఠశాలల్లో 30 కన్నా తక్కువ విద్యార్థులున్న పాఠశాలలపై వేటు పడనుంది. 

మరిన్ని రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి!