Skip to main content
Latest News

తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలి: పవన్

తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలపై.. ఫలితాల్లో ఏర్పడిన గందరగోళంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. విద్యార్థుల భవిష్యత్‌ను అగమ్యగోచరంగా మార్చడం దారుణమన్నారు. ఫలితాల విషయంలో జరుగుతున్న గందరగోళానికి, విద్యార్థుల ఆత్మహత్యలకు తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ‘విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. పరీక్ష ఫీజు చెల్లింపు, మూల్యాంకనం నుంచి ఫలితాల వెల్లడి వరకూ చాలా సందేహాలున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల అనుమానాలు నివృత్తి చేసి, నిజాలు వెల్లడించాలి. ఉచితంగా రీవాల్యుయేషన్‌, రీ వెరిఫికేషన్‌ చేయాలి. జీవితం విలువైనది.. ఫలితాలతో నిరాశ చెంది ఆత్మహత్యలకు పాల్పడొద్దు. చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేసి తగిన పరిహారం చెల్లించాలి. బోర్డు అధికారులు, సాఫ్ట్‌వేర్‌ సంస్థపై చర్యలు తీసుకుని న్యాయ విచారణకు ఆదేశించాలి’ అని పవన్‌ డిమాండ్‌ చేశారు.