Skip to main content
Latest News

అధికారులదే అత్యుత్సాహం.. హీరో ప్రభాస్‌కు కాస్త ఊరట

హైకోర్టులో హీరో ప్రభాస్‌కు ఊరట లభించింది. ఆయనకు సంబంధించిన ఓ గెస్ట్‌హౌస్‌ను అధికారులు స్వాధీనం చేసుకోవడంపై కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. ప్రభాస్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. అధికారుల తీరును తప్పుబట్టింది. హైదరాబాద్‌ రాయదుర్గ్‌లో ప్రభాస్‌కు చెందిన గెస్ట్‌హౌస్‌ స్వాధీనం చేసుకోవడంలో రెవెన్యూ అధికారులు వ్యవహరించిన తీరును హైకోర్టు గర్హించింది. నిబంధనలు పాటించకుండా చర్యలు తీసుకోవడం సరికాదని పేర్కొంది. 1958 నుంచి పైగా భూములకు సంబంధించి వివాదం నడుస్తున్నందున ఆ భూములను తిరిగి స్వాధీనం చేయాలని, ప్రభాస్‌కు అప్పగించలేమని తేల్చి చెప్పింది. ప్రభాస్‌ పెట్టుకున్న క్రమబద్ధీకరణ దరఖాస్తుపై 8 వారాల్లో ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ ఉత్తర్వులను తిరస్కరిస్తే తగిన ఆదేశాల నిమిత్తం తిరిగి ప్రభాస్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని తెలిపింది. 

తన భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ గేటుకు తాళాలు వేయడాన్ని సవాలు చేస్తూ గతంలో హైకోర్టులో ప్రభాస్ పిటిషన్‌ వేశారు. దీనిపై జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెల్లడించింది. విక్రయ దస్తావేజుల ద్వారా భూమిని కొనుగోలు చేసినప్పటికీ వివాదాలు తలెత్తరాదన్న ఉద్దేశంతో ప్రభాస్‌ క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారని, దీని పరిష్కారంలో అధికారులు సక్రమంగా వ్యవహరించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. చట్ట వ్యతిరేకంగా అధికారులు భూమిని స్వాధీనం చేసుకున్నపుడు దాన్ని తిరిగి అప్పగించాలంటూ ఆదేశాలివ్వవచ్చని, ఈమేరకు సుప్రీం కోర్టు తీర్పులున్నాయంది. ప్రస్తుతం ఈ భూమి వ్యవహారంలో దశాబ్దాలుగా వివాదం ఉన్న నేపథ్యంలో భూమిని తిరిగి స్వాధీనం చేయాలన్న ఉత్తర్వులు ఇవ్వడంలేదని స్పష్టం చేసింది. క్రమబద్ధీకరణ నిమిత్తం ప్రభాస్‌ పెట్టుకున్న దరఖాస్తును  ప్రజా, ప్రభుత్వ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరిగణనలోకి తీసుకోవాలంది.