Skip to main content
Latest News

అనారోగ్యంతో వేణుమాధవ్ కన్నుమూత.. 

ప్రముఖ సినీనటుడు వేణు మాధవ్‌ కన్నుమూశారు. అనారోగ్యంతో సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ నెల 6వ తేదీన ఆసుపత్రిలో చేరారు. మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందించారు. అయితే ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఈ మధ్యాహ్నం 12.21 గంటలకు మృతిచెందాడని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

సినిమాలంటే ఇష్టంతో హైదరాబాద్‌కు వచ్చిన వేణుమాధవ్.. తొలినాళ్లలో టీడీపీ కార్యాలయంలో పనిచేశారు. ఎన్టీఆర్‌తో ఆయనకు ఎంతగానో సాన్నిహిత్యం ఉంది. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాక కూడా.. టీడీపీకి ప్రచారం చేశారు. చంద్రబాబుతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఎన్నికల్లో టీడీపీ తరపున కూడా ప్రచారం చేస్తూ వచ్చారు. తన స్వస్థలమైన కోదాడ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఉందంటూ ఎన్నోసార్లు చంద్రబాబును అడిగారు. అయితే పొత్తుల్లో భాగంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆ సీటును ఇవ్వలేకపోయారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినా.. దాన్ని తిరస్కరించారు. మొత్తానికి టీడీపీకి చెందిన నేతలు.. ముగ్గురు వరుసగా మృతి చెందడం ఆ పార్టీ నేతలను శోకసంద్రంలో ముంచెత్తుతోంది. మొదట కోడెల శివప్రసాద్, ఆ తర్వాత చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్.. తాజాగా వేణు.. మరణించడంతో అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 

మిమిక్రీ ఆర్టిస్ట్‌ నుంచి...
మిమిక్రీ కళాకారుడిగా కెరీర్‌ను ప్రారంభించిన వేణుమాధవ్‌.. తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించి టాప్‌ కమెడియన్‌గా ఎదిగారు. ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంప్రదాయం’తో వేణుమాధవ్‌ వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. అదే సమయంలో పవన్‌కల్యాణ్‌ ‘తొలిప్రేమ’వేణుమాధవ్‌కు ఎంతో గుర్తింపు తెచ్చింది. ఆ చిత్రం తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రంతో హాస్యనటుడిగా పరిచయమైన వేణుమాధవ్‌ మళ్లీ ఆయన దర్శకత్వంలోనే ‘హంగామా’తో కథానాయకుడిగా మారారు. ఆ తర్వాత ‘ప్రేమాభిషేకం’ తో నిర్మాతగా మారారు. అయితే ఆ సినిమా ఆయనకు హీరోగానూ, నిర్మాతగానూ నష్టాన్ని మిగిల్చింది. 

వేణుమాధవ్‌ నటించిన ఎన్నో చిత్రాల్లో ఆయన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. ‘తొలిప్రేమ’లో ఆయన పోషించిన ఆర్నాల్డ్‌ పాత్ర ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది.  ఆ పాత్రే ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోకుండా చేసింది. ఆ తర్వాత ‘దిల్‌’లో వేణు పాత్రలో నటించారు. ఎల్బీ శ్రీరామ్‌కి ఆయనకు మధ్య జరిగే సంభాషణలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘లక్ష్మి’లో టైగర్‌ సత్తి పాత్రలో మరోసారి బాగా నవ్వించారు. ‘ఆది’ ‘సింహాద్రి’, ‘సై’, ‘రణం’, ‘వెంకీ’, ‘ఛత్రపతి’, ‘పోకిరి’, ‘రచ్చ’ వంటి ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించారు. ఆయన చివరిగా ‘రుద్రమదేవి’ చిత్రంలో కనిపించారు.

మరిన్ని  సినిమా వార్తల కొరకు మా మూవీస్ పేజీ ని వీక్షించండి .. 

Tollywood News