Skip to main content
Latest News

కొబ్బరిమట్ట సినిమాను సిటీలో ఎందుకు విడుదల చేయలేదంటూ.. సెల్‌టవర్ ఎక్కిన సంపూ అభిమాని..

‘ఏం.. స్టార్ హీరోల సినిమాలైతేనే విడుదల చేస్తారా..? మా సంపూ సినిమాను ఎందుకు థియేటర్లు తీసుకోలేదు.. ఈ సిటీలో ఎక్కడా విడుదల కాలేదు.. అభిమానులంతా ఎక్కడకు వెళ్లి సినిమా చూడాలి.. ఇదేం వివక్ష.. కొబ్బరిమట్ట సినిమాను వెంటనే థియేటర్లలో ప్రదర్శించాలి.. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటా..’ అంటూ సినీ హీరో సంపూర్ణేష్‌బాబు వీరాభిమాని హల్‌చల్ చేశాడు. సెల్‌టవర్ ఎక్కి.. మూడు గంటల పాటు హల్‌చల్ చేశాడు. ఎవరు ఎంతగా చెప్పినా వినిపించుకోలేదు. చివరకు అతడి దెబ్బకు పోలీసులు దిగి వచ్చి.. న్యాయం చేస్తామంటూ హామీ ఇస్తే కానీ అతడు సెల్ టవర్ నుంచి కిందకు దిగలేదు. చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో జరిగిందీ ఘటన. 

మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలోని బాబుకాలనీకి చెందిన డి.రామచంద్ర కుమారుడు రెడ్డెప్ప(23) టూవీలర్‌ మెకానిక్‌. కొబ్బరిమట్ట సినిమా శనివారం రాష్ట్రవ్యాప్తంగా విడుదలైనప్పటికీ మదనపల్లెలో విడుదల కాలేదు. దీంతో శనివారం రెడ్డెప్ప తన స్నేహితులతో కలసి ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సినిమా విడుదల చేయాలని దర్శక, నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్లను, థియేటర్ యజమానులను కోరాడు. వారు స్పందించకపోవడంతో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్థానిక అయోధ్యనగర్‌లోని ఓ సెల్‌టవరెక్కాడు. గమనించిన స్థానికులు వెంటనే టూటౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ సునీల్‌కుమార్‌ సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకుని ఫోన్‌ చేసి రెడ్డెప్పతో మాట్లాడారు. కిందకు దిగొస్తే న్యాయం చేస్తామని చెప్పినా సాయంత్రం ఆరుగంటల వరకూ టవర్‌పైనే ఉండిపోయాడు. స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో రెడ్డప్ప నానాహంగామా చేశాడు. మిగిలిన హీరోల సినిమాలైతే విడుదల చేస్తారు..సంపూర్ణేష్‌బాబు చిత్రాన్ని ఎందుకు విడుదల చేయరంటూ పోలీసులను ప్రశ్నించాడు. దీంతో పోలీసులు రెడ్డెప్ప చిన్నమ్మ కుమారుడు ప్రశాంత్‌ను టవర్‌ ఎక్కించి కిందకు దింపే ప్రయత్నం చేశారు. అర్ధగంట అనంతరం రెడ్డెప్ప కిందకు దిగొచ్చాడు. దీంతో అటు పోలీసులు, ఇటు జనం ఊపిరి పీల్చుకున్నారు. మద్యం మత్తులో ఉండడంతో రెడ్డెప్పను పోలీసులు జీపులో స్టేషన్‌కు తరలించారు.

 

మర్రిని సినిమా వార్తల కొరకు మా మూవీస్ పేజీ ని వీక్షించండి .. 

Tollywood News