Skip to main content
Latest News

వేణుమాధవ్.. ఐదేళ్లుగా సినిమాల్లో నటించకపోవడానికి అసలు కారణమిదా..!?

అనారోగ్యంతో కన్నుమూసిన టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్‌... ఒక దశలో సినీ రంగంలోని అందరు కమెడియన్ల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. రాజమౌళి, వినాయక్ వంటి స్టార్ డైరెక్టర్లు వేణుమాధవ్‌కు తమ సినిమాల్లో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ రోల్స్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు. వీరి బాటలోనే అనేక మంది దర్శకులు వేణుమాధవ్ కామెడీకి తమ సినిమాల్లో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. స్టార్ హీరోలు సైతం తమ సినిమాల్లో వేణుమాధవ్ ఉండేలా చూసుకున్నారంటే... కమెడియన్‌గా అతడి స్టార్ డమ్ ఏ రేంజ్‌లో కొనసాగిందో అర్థం చేసుకోవొచ్చు. అయితే  ఐదేళ్ల నుంచి వేణుమాధవ్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అవకాశాలు వస్తున్నా... ఆయా సినిమాల్లో నటించేందుకు మాత్రం ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. దీనికి కారణం ఏంటని.. ఆయన్న ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే.. షాకింగ్ నిజాన్ని చెప్పారు. 

Read Also :  అనారోగ్యంతో వేణుమాధవ్ కన్నుమూత.. 

‘ప్రస్తుతం చాలా తక్కువ సంఖ్యలోనే మంచి సినిమాలు వస్తున్నాయి. చక్కగా కుటుంబమంతా వెళ్లి చూసే సినిమాలు ఎప్పుడో కానీ రావడం లేదు. కామెడీ కూడా ట్రాక్ తప్పింది. అప్పటి జంథ్యాల, ఈవీవీ సత్యనారాయణ హాస్యం వేరు. ఇప్పటి హాస్యం వేరు. ఇప్పుడున్నదంతా సెటైరికల్ హాస్యం. ఎదుటివాడిని కించపరచడమో లేక తక్కువ చేసి మాట్లాడటం ద్వారా వస్తున్న హాస్యమో ఉంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్‌కయితే ఇక అంతే లేదు. నాన్నా ఈ పదానికి అర్థం ఏంటీ..? అని సినిమా చూస్తున్న నా పిల్లలు అడిగితే ఏం సమాధానం చెప్పాలి. అందుకే అలాంటి సినిమాల్లో నేను నటించొద్దనుకున్నా. పాత్ర నచ్చితే చేస్తున్నా.. నచ్చకపోతే రిజెక్ట్ చేస్తున్నా. నేను రిజెక్ట్ చేసిన సినిమాకు సంబంధించిన వాళ్లే.. నాకు కొన్ని సినిమా ఛాన్స్‌లు రాకుండా చేస్తున్నారని నాకు తెలుసు. కానీ వాళ్ల పాపానికి వాళ్లనే వదిలేస్తున్నా..’ అంటూ వేణుమాధవ్ వివరించారు.

Read Also :  వేణుమాధవ్‌ను ఎన్టీఆర్.. ఏమని పిలిచేవారో తెలుసా..?

దాదాపు ఐదేళ్ల నుంచి వేణుమాధవ్ సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. మధ్యలో ఆయన చనిపోయారంటూ ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పేవారు. ఇలాంటి వార్తలతో తమను ఇబ్బంది పెట్టొద్దని కోరేవారు. అయితే ఆయన అనారోగ్యంతో ఉన్నారని మాత్రం అందరికీ తెలుసు. కొందరు సినీ ప్రముఖులు ఎప్పటికప్పుడు వేణు మాధవ్ బాగోగుల గురించి, ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ వచ్చారు. సినిమాల కంటే ఆరోగ్యం ముఖ్యమని పలువురు ఆయనకు సలహా ఇచ్చారు. అయితే ఆరోగ్యం క్షీణించడం, రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు వేణుమాధవ్. ఎంతోమందిని నవ్వించి... చివరకు తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు.

మరిన్ని  సినిమా వార్తల కొరకు మా మూవీస్ పేజీ ని వీక్షించండి .. 

Tollywood News