Skip to main content
Latest News

మరో కొత్త సినిమాను స్టార్ట్ చేసిన రాజ్ తరుణ్.. వెరైటీ టైటిల్‌తో..

కొద్ది రోజుల క్రితం ఓ కారు యాక్సిడెంట్ కేసులో రాజ్ త‌రుణ్ వార్త‌ల‌లో నిలిచిన విష‌యం తెలిసిందే. ఈ వివాదం మ‌రింత ముదురుతున్న క్ర‌మంలోనే రాజ్ త‌రుణ్ సోష‌ల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చి వివాదానికి చెక్ పెట్టాడు. క‌ట్ చేస్తే ఈ కుర్ర హీరో.. మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అయ్యాడు. గుండె జారి గల్లంతయిందే(2013), ఒక లైలా కోసం(2014) వంటి చిత్రాలను తెరకెక్కించి మంచి ప్రశంసలు అందుకున్న విజయ్ కుమార్ కొండతో సినిమాను స్టార్ట్ చేశాడు.. ఈ చిత్రానికి ఓ వెరైటీ టైటిల్ పెట్టారు. ఏమైంది ఈవేళ, అధినేత, బెంగాల్‌ టైగర్‌, పంతం వంటి సూపర్ హిట్‌ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాత కె కె రాధామోహన్.. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై ఈ సినిమాను తీస్తున్నారు. 

ఈ సినిమాకు ‘ఒరేయ్.. బుజ్జిగా’ అనే ఆసక్తికర టైటిల్‌ను నిర్ణయించినట్టుగా నిర్మాత రాధామోహన్ తెలిపారు. ‘ రాజ్ తరుణ్, కొండా విజయ్‌కుమార్‌ కాంబినేషన్ లో మా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం 8 ప్రారంభించాం. ఈ చిత్రానికి  ‘ఒరేయ్.. బుజ్జిగా’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశాం. ఈ రోజు నుండి నాన్ స్టాప్‌గా షూటింగ్ జరుగుతుంది. మా బ్యానర్ లో ఒరేయ్.. బుజ్జిగా మరో మంచి హిట్ చిత్రం అవుతుంది’ అని రాధామోహన్ అన్నారు. ఈ సినిమాలో హీరో రాజ్ తరుణ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా వాణి విశ్వనాధ్, నరేష్, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 10 నుండి నిరవధికంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి అనూప్‌ సం‍గీతమందిస్తున్నారు. ఈ మధ్య వరుస ఫ్లాప్స్‌తో ఉన్న రాజ్ తరుణ్.. ఈ సినిమాతోనైనా హిట్ ట్రాక్‌ మీదకు వస్తాడో లేదో.. వేచిచూడాలి. 

మరిన్ని  సినిమా వార్తల కొరకు మా మూవీస్ పేజీ ని వీక్షించండి .. 

Tollywood News