Skip to main content
Latest News

జియో ఫస్ట్‌ డే ఫస్ట్‌ ఫోకు.. మల్టీప్లెక్స్ సంస్థల నుంచి ఊహించని షాక్

‘మీ అభిమాన హీరో సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడొచ్చు.. ఇంట్లో ఉండే వీక్షించొచ్చు..’ అంటూ రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటనతో సినీ రంగం ఉలిక్కి పడింది. ముఖ్యంగా థియేటర్లు, మల్టిప్లెక్స్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు ఖంగుతిన్నారు. 2020లో రాబోతున్న ‘జియో ఫస్ట్ డే ఫస్ట్ షో’ సేవలపై వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జియో ఆ ప్లాన్‌ను కనుక విజయవంతంగా అమలు చేస్తే.. వారంతా తీవ్రంగా నష్టపోవడం ఖాయం. `విశ్వరూపం` సమయంలో డి.టి.హెచ్‌లో సినిమాను డైరెక్ట్‌గా రిలీజ్ చేస్తానని కమల్‌హాసన్ ప్రకటించగానే సినిమా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ పెద్ద ఎత్తున యుద్ధమే చేశారు. దాంతో కమల్ తన ప్రయత్నాన్ని అప్పట్లో విరమించుకున్నారు. నిర్మాతలకు జియో వల్ల కాసులు వస్తాయి. నిర్మాతలు నష్టపోయే అవకాశం ఉండదు. కానీ తొలిరోజునే టీవీల్లో సినిమా చూసే అవకాశం వస్తే.. థియేటర్‌కు ప్రేక్షకుడు వస్తాడా? అనేది ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికే ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం తగ్గించేశారు. ఇప్పుడు రిలయన్స్.. జియో పైబర్ ప్లాన్‌ను అమలు చేస్తే సినిమా రంగాన్ని వ్యాపారంగా మలచుకున్న మల్టీప్లెక్స్, డిస్ట్రిబ్యూటర్లకు చాలా పెద్ద ఎదురుదెబ్బ తగులుతుంది అనడంలో సందేహం లేదు. దీంతో.. ముఖేశ్ అంబానీ ప్రకటించిన ఈ నిర్ణయంపై పీవీఆర్‌, ఐనాక్స్‌ వంటి మల్టీప్లెక్స్ సంస్థలు విచారం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు సంయుక్తంగా ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశాయి. 

‘ఎన్నో ఏళ్లపాటు థియేటర్లలో సినిమాలు చూడటం ఓ సంప్రదాయంగా వస్తోంది. దీనివల్ల నిర్మాతలు, పంపిణీదారులు లాభపడుతున్నారు. భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగానూ నిర్మాతలు తమ సినిమాలను థియేటర్లలోనే కాకుండా కొన్ని నెలల తర్వాత డీవీడీ, డీటీహెచ్‌ల రూపంలో విడుదల చేసేవారు. సినిమా కంటెంట్‌కు నిర్మాతే యజమాని. కాబట్టి తమ సినిమాలను ఏ మాధ్యమం ద్వారా విడుదల చేసుకోవాలనేది పూర్తిగా వారి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. అదీకాకుండా మన భారతీయ నిర్మాతలు, పంపిణీదారులు, మల్టీప్లెక్స్‌ యజమానులు సినిమాలను థియేటర్‌లో ఎనిమిది వారాల పాటు ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాతే ఇతర మాధ్యమాల్లో విడుదల చేయాలని అనుకుంటున్నారు’ అని ఐనాక్స్‌, పీవీఆర్‌ సంస్థలు ఓ ప్రెస్‌నోట్‌లో తమ అభిప్రాయాలను వ్యక్తపరిచాయి.
 

మరిన్ని  రాజకీయ వార్తల కొరకు మా పాలిటిక్స్ పేజీ ని వీక్షించండి... 

Telugu News Online