Skip to main content
Latest News

సైరా ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ ట్రైలర్ విడుదలయింది. బుధవారం సాయంత్రం 5.31 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేశారు. సినిమాలోని ప్రముఖ తారాగణం అంతా కనిపించేలా ఈ ట్రైలర్‌ను రూపొందించారు. రోమాలు నిక్కపొడుచుకునే డైలాగ్స్, యుద్ధ సన్నివేశాలు, అద్భుతమైన లొకేషన్లు, అదిరిపోయే సెంటిమెంట్‌ ఈ సినిమాలో ఉందంటూ ట్రైలర్‌ ద్వారానే చెప్పేశారు. ఈ ట్రైలర్‌లో మెగాస్టార్ చిరంజీవి.. అదరగొట్టేశారని చెప్పవచ్చు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి కనిపిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. 2.54 నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ అద్భుతంగా ఉంది. టీజర్‌లో నరసింహారెడ్డి పాత్రను మాత్రమే చూపించగా.. ట్రైలర్‌లో మిగిలిన ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మగా నయనతార నటించారు. నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కనిపించనున్నారు. ఇక అవుకు రాజుగా కిచ్చా సుదీప్, రాజా పాండిగా విజయ్ సేతుపతి, వీరారెడ్డిగా జగపతిబాబు, లక్ష్మిగా తమన్నా నటించారు.

ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రామ్ చరణ్ నిర్మాతగా, సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో వస్తోందీ సినిమా. అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి స్టార్స్ నటిస్తున్నారు. 250 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు రామ్ చరణ్. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. యూఎస్‌లో అక్టోబర్ 1న ప్రీమియర్లు ప్రదర్శిస్తారు. అక్కడ స్నోఫ్లేక్ సినిమా సంస్థ ‘సైరా’ను విడుదల చేస్తోంది. ప్రీమియర్లను భారీ ఎత్తున ప్రదర్శించడం కోసం వీకెండ్ సినిమా, థింక్ బిగ్ పిక్చర్స్ సంస్థలతో స్నోఫ్లేక్ సినిమా చేయికలిపింది. మొత్తం మీద యూఎస్‌లో రికార్డు స్థాయిలో ప్రీమియర్లు ప్రదర్శించబోతున్నారు. ‘సైరా’ మొత్తం ఐదు భాషల్లో విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. కాబట్టి, ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో ఉంటాయని అంచనా వేస్తున్నారు.

మరిన్ని  సినిమా వార్తల కొరకు మా మూవీస్ పేజీ ని వీక్షించండి .. 

Tollywood News