Skip to main content
Latest News

మళ్లీ ‘మా’లో రచ్చ.. నరేశ్‌కు రాజశేఖర్ షోకాజ్ నోటీసులు..!

టాలీవుడ్ నటీనటుల సంఘం 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)లో మరోసారి విభేదాలు బహిర్గతమయ్యాయి. యూనియన్‌లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, అధ్యక్షుడు నరేశ్‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని హీరో రాజశేఖర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆయన నేతృత్వంలోని కొందరు కమిటీ సభ్యులు ఇప్పటికే నోటీసులపై సంతకాలు కూడా చేసినట్టు సమాచారం. ‘మా’ సంస్థకు సంబంధించిన కొన్ని పెండింగ్ సమస్యలు గురించి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవాలని మా కమిటీ భావిస్తున్నా ఆ విషయాలపై నరేశ్ ఆసక్తి కనపరచక పోవడం రాజశేఖర్‌కు అదే విధంగా మా కమిటీకి అసహనం కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇద్దరు ముఖ్యమంత్రులను కలిసి మా సంస్థ వ్యవహారాలను చక్కపెట్టవలసిన అవసరం ఉన్న నేపధ్యంలో ఈ కీలక అంశాల పట్ల కూడ నరేశ్ ఉదాసీనంగా ప్రవర్తించడం మా కమిటీకి తీవ్ర అసంతృప్తిగా మారింది అని టాక్. 

మాలో కొత్త బాడీ ఏర్పాటు  అయి ఆరు నెలల కావస్తోంది. కానీ ఇప్పటివరకు మాలో ఎలాంటి ఫండ్స్ కలెక్ట్ చేయలేదు. చాలా రోజుల నుంచి నరేష్ మా మీటింగ్స్‌కు రావడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ ఏవో పనులు ఉన్నాయంటూ ఆయన మా సమావేశాలకు హాజరుకావడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి 11 గంటలకు మా కార్యవర్గ సభ్యులు సమావేశం అయ్యారు. నరేష్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు సభ్యులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఫండ్ కలెక్షన్ కోసం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నదానిపై కూడా చర్చలు జరిపారు.

కొద్దిరోజుల క్రితం మా సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు రాజశేఖర్ ఇంటిలో సమావేశమయ్యారు. సంస్థకు సంబంధించిన పెండింగ్ సమస్యల గురించి ఒక నిర్ణయం తీసుకోవాలనేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ‘మా’ సంస్థ అధ్యక్షుడు నరేశ్‌ను ఆహ్వానించినా ఆయన రాకపోవడంతో రాజశేఖర్ తీవ్ర అసహనానికి లోనైనట్లు టాక్. దీనితో మా సంస్థ వ్యవహారాలన్నింటినీ ఇకపై తానే చూస్తానంటూ రాజశేఖర్ అన్నారట. ‘మా’ సంస్థకు సంబంధించిన కీలక సమస్యలపై అధ్యక్షుడు నరేష్‌ను పక్కకు పెట్టి తానే నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారట. గతంలో 'మా' ఎన్నికల తరువాత, పలుమార్లు రాజశేఖర్, నరేశ్ ల మధ్య గొడవలు జరిగినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మార్చిలో ఎన్నికలు జరుగగా, ప్రమాణ స్వీకారం రోజునే రాజశేఖర్ అలిగారు. నరేశ్ మాట్లాడుతూ, 'నేను... నేను' అని పదేపదే అనడంతో, అందరమూ కలిసున్న కమిటీలో 'మేము' అనకుండా, నేను అనడం ఏంటని రాజశేఖర్ మండిపడ్డారు కూడా. ఆపై పెద్దల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగినట్టు కనిపించినా, నివురుగప్పిన నిప్పులా విభేదాలు కొనసాగాయని సమాచారం. ఇక తాజాగా, ఈ షోకాజ్ నోటీసుల వ్యవహారం ఎంతవరకూ వెళుతుందో వేచి చూడాలి.

మరిన్ని  సినిమా వార్తల కొరకు మా మూవీస్ పేజీ ని వీక్షించండి .. 

Tollywood News