Skip to main content
Latest News

వేణుమాధవ్ సొంత ఇంటికి వెరైటీ పేరు.. దానికో పెద్ద కథే ఉంది..!

హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వేణుమాధవ్ బుధవారం చనిపోయారు. అయన మరణం పట్ల సినీ పరిశ్రమ సంతాపం తెలిపింది.. తెలుగు పరిశ్రమ మంచి నటుడుని కోల్పోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వేణుమాధవ్ సినిమాల్లోకి రాకముందు మిమిక్రి ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. పలువురు సినీ రాజకీయ నాయకులను ఇమిటేట్ చేయడంతో ఆయనకి మిమిక్రి ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు లభించింది. టీడీపీ ఆఫీసులో రూ.600 జీతానికి పనిచేస్తూ.. సినిమాల్లో ఛాన్స్‌ల కోసం వేణుమాధవ్ ట్రై చేశారు. చివరకు ఆయన ప్రయత్నాలు ఫలించాయి. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన "సంప్రదాయం" సినిమాతో వేణుమాధవ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమాలో నటించే అవకాశం ఎలా వచ్చిందో.. గతంలో ప్రైవేటు ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణుమాధవ్ వెల్లడించారు. 

Read Also : విషమ పరిస్థితుల్లో ఉన్నా.. పవన్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న వేణుమాధవ్

‘రచయిత దివాకర్ బాబుకి సన్మాన కార్యక్రమం ఉంటే దానికి నన్ను పిలిచారు. అ సన్మాన కార్యక్రమంలో నేను చేసిన హాస్యం దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డికి బాగా నచ్చింది. దీంతో సినిమాల్లో నటించాలని ఆఫీస్‌కి పిలిచారు. 35 రోజుల షూటింగ్‌లో పాల్గొనాలని వారు అడిగారు. రోజుకు రెండు వేలు ఇస్తే చేస్తానని చెప్పాను. అప్పుడు వారు సంతోషంగా డెబ్బై వెల రూపాయలు ఇచ్చారు. అలా నా మొదటి సినిమాకి రెమ్యునిరేషన్ రూ.70వేలు తీసుకున్నా.. నిజానికి వాళ్లు అంత మొత్తానికి ఒప్పుకుంటారని నేను ఊహించలేదు. అప్పట్లో రూ.70 వేలంటే మామూలు మాటలు కాదు.. ఆ సినిమా తర్వాత నేను వెనక్కి తిరిగి చూడలేదు. వరుసగా అవకాశాలు వచ్చాయి..’ అని వేణుమాధవ్ చెప్పుకొచ్చారు. సంప్రదాయం సినిమాతోనే తనకు ఇంత అదృష్టం రావడం.. పేరు ప్రఖ్యాతులు రావడంతో.. ఆ సినిమాలో నటించేందుకు ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు, నిర్మాతలకు వినూత్న రీతిలో వేణుమాధవ్ కృతజ్ఞతలు తెలిపారు. మొదటి సినిమా అవకాశాన్ని ఇచ్చిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి నిర్మాత అచ్చిరెడ్డిలను జీవితాంతం గుర్తుంచుకునేలా.. తన పిల్లలు కూడా వారికి కృతజ్ఞతగా ఉండేలా.. వేణుమాధవ్ తన ఇంటికి ‘అచ్చివచ్చిన కృష్ణ నిలయం’ అని పేరు పెట్టుకున్నారు. అలా అచ్చిరెడ్డిని, ఎస్వీ కృష్ణారెడ్డి పేర్లను తన ఇంటి పేరుగా పెట్టుకున్నారు. 

మరిన్ని  సినిమా వార్తల కొరకు మా మూవీస్ పేజీ ని వీక్షించండి .. 

Tollywood News