Skip to main content
Latest News

విషమ పరిస్థితుల్లో ఉన్నా.. పవన్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న వేణుమాధవ్

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ కమెడియన్ వేణుమాధవ్ కన్నుమూశారు. టాలీవుడ్‌లోని అందరు టాప్ హీరోలతోనూ నటించిన ఆయన కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. సికింద్రాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. గురువారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు. అయితే, అందరి కంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఆయనకు ప్రత్యేక అనుబంధం. ఇద్దరికీ ఒకే సమయంలో స్టార్ డమ్ వచ్చిందని చెప్పాలి. సంప్రదాయం సినిమా ద్వారా వేణుమాధవ్ తెరంగేట్రం చేసినా.. తొలిప్రేమ సినిమా అతడిని స్టార్ కమెడియన్‌‌ని చేసింది. పవన్ కళ్యాణ్, వేణుమాధవ్ కలిసి నటించిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ రెండో చిత్రం గోకులంలో సీత సినిమాలో వారిద్దరూ తొలిసారి కలసి నటించారు.

Also Read : వేణుమాధవ్ సొంత ఇంటికి వెరైటీ పేరు.. దానికో పెద్ద కథే ఉంది..!

 పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌లో మైలురాళ్లు లాంటి సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు చిత్రాల్లోనూ వేణుమాదవ్ నటించాడు. గుడుంబాశంకర్, బంగారం, అన్నవరం సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్, వేణుమాధవ్ వెండితెరను పంచుకున్నారు. అయితే, వారిద్దరి మధ్య ఓ ఒప్పందం ఉందట. పవన్ కళ్యాణ్‌కు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. స్వయంగా వ్యవసాయం చేస్తారు. పశుసంపదను పోషిస్తారు. వేణుమాధవ్ కూడా ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బుతో తన సొంతూరులో పదెకరాలు పొలం కొని వ్యవసాయం చేసేవారట. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్.. ఆ పొలంలో పండిన దాంట్లో ప్రతి ఏటా ఓ బస్తా బియ్యం తనకు పంపాలని కోరారట. అందుకు ఓకే చెప్పిన వేణుమాధవ్ ప్రతి ఏటా బస్తా బియ్యం పంపుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన తోటలో పండిన పండ్లను వేణుమాధవ్‌కి పంపేవారు. ఐదేళ్లుగా అనారోగ్యంతో వేణుమాధవ్ బాధపడుతున్నా.. అప్పుడప్పుడు పరిస్థితి అదుపుతప్పి.. ప్రాణాపాయ స్థితిలోకి చేరుకున్నప్పటికీ.. పవన్‌కు మాత్రం ఠంచనుగా ప్రతి ఏడాది ఒక బస్తా బియ్యాన్ని పంపించేవారు. కన్ను మూసేవరకు పవర్‌స్టార్‌కు ఇచ్చిన మాటను వేణుమాధవ్ నిలబెట్టుకున్నారని ఆయన సన్నిహితులు గుర్తుచేసుకుంటున్నారు. 

మరిన్ని  సినిమా వార్తల కొరకు మా మూవీస్ పేజీ ని వీక్షించండి .. 

Tollywood News