Skip to main content
Latest News

‘మంత్రి పదవికి రాజీనామా చేస్తా.. అవసరమైతే సుప్రీంకు వెళ్తా..’

‘నా శాఖకు సంబంధించి మరో నాలుగు రోజుల్లో సమీక్ష చేస్తా.. ఇప్పుడు వర్షాలు తీవ్రంగా పడుతున్నాయి. వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నష్టంపై సమీక్ష చేసి రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులతో కలిసి నా శాఖకు సంబంధించి సమీక్ష నిర్వహిస్తా.. ఎవరు అడ్డుకుంటారో చూస్తా.. అవసరం అయితే సుప్రీంకోర్టుకు అయినా వెళ్తా..’ అంటూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలితాలు వచ్చేవరకూ మంత్రులకు పనేమీ లేదని ఎన్నికల కమిషన్‌ చెప్తే ఈ క్షణంలోనే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ ఆయన వ్యాఖ్యానించారు. తాము అధికారానికి కొత్త కాదనీ... ఎన్నికల సమయంలో ఉండే నిబంధనలన్నీ తమకు తెలుసునన్నారు. ఎన్నికల కోడ్‌ ఉన్న సమయంలో మంత్రులు విధానపరమైన కొత్త నిర్ణయాలు తీసుకుంటే తప్పు కానీ కొనసాగుతున్న పథకాలు, కార్యక్రమాలపై సమీక్ష చేయడం సంబంధిత అధికారులకు ఆదేశాలివ్వడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఎన్నికలు పూర్తయ్యాక ఇప్పుడు కొత్తగా తాము ఓటర్లను ప్రభావితం చేసేదేముంటుందన్నారు. అసెంబ్లీ రద్దయితేనో.. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తేనో ఆపద్ధర్మ ప్రభుత్వం వస్తుంది కానీ..  ఇప్పుడు ఉన్నది ఆపధ్ధర్మ ప్రభుత్వం కాదనీ.. ఎన్నికైన ప్రభుత్వమని సోమిరెడ్డి గుర్తుచేశారు. 

ఇక్కడ నిన్నా మొన్న అకాల వర్షాలు, వడగళ్ల వానలు వచ్చి ధాన్యం తడిసిపోయింది. తోటలు దెబ్బతిన్నాయి. వాటిపై సర్వే నిర్వహించాలి. ధాన్యం కొనుగోలు చేయాలి. నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి. ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? ఎన్నికల కమిషన్‌ చేస్తుందా? చేయమనండి. మేమూ చేయక.. వాళ్లూ చేయక ఎవరు చేస్తారు? రైతుల పరిస్థితి ఏంటి..? వాళ్లను గాలికి వదిలేయాల్సిందేనా..? అని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.  తెలంగాణలో 20 మందికి పైగా పిల్లలు ఇంటర్‌ ఫలితాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారనీ. ఈ పరిణామానికి ఎవరు సమాధానం చెప్పాలి? అక్కడ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సమాధానం చెప్పాలా..? లేక ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి.. ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలా..? అని ప్రశ్నించారు. సమీక్షలు చేయకూడదని ఈసీ అంటే ఏ నిబంధనలో ఉందో చూపించాలన్నారు. అలా చూపితే ఆ వెంటనే నా మంత్రి పదవిని వదిలేస్తానని ప్రకటించారు. శాఖాపరమైన సమీక్ష పెడుతున్నట్లు ఈసీకి ముందుగా చెప్పి అనుమతి తీసుకోవలసిన అవసరం లేదని.. ఈ ఏడాదే ఈసీకి ప్రత్యేక అధికారాలేవీ రాలేదని అన్నారు. ఒకపక్క ఎన్నికలు జరుగుతుంటే ప్రధాని ఈ నెల 15న మంత్రివర్గ సమావేశం పెడితే ఏం చేసింది? పొరుగున తెలంగాణలో ముఖ్యమంత్రి తన విధులు నిర్వర్తించడం లేదా? అక్కడెందుకు ఈ ప్రశ్నలు లేవనెత్తడం లేదు’ అని ప్రశ్నించారు.