Skip to main content
Latest News

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో లేటెస్ట్ అప్‌డేట్

ఎన్నికలు కొద్ది రోజుల సమయం ఉందనగా జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్యకేసులో ప్రధాన నిందితులయిన ఎర్ర గంగిరెడ్డి, పీఏ క్రిష్ణారెడ్డి, డ్రైవర్‌ ప్రసాద్‌బాబులను సోమవారం పోలీసులు కడప జిల్లా ప్రొద్దుటూరు సెకెండ్‌ ఏడీఎం కోర్టులో హాజరుపరిచారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సరిగ్గా నాలుగు రోజులకు మార్చి 15న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గురైన సంగతి తెలిసిందే. తెల్లవారు జామున హత్య జరిగిందని తేలడం.. ఆ తర్వాత బెడ్‌రూంలోనూ, బాత్రూంలోనూ సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించడం జరిగాయి. మొదట గుండెపోటు అంటూ సమాచారం ఇచ్చినా.. ఆ తర్వాత ఒంటిపై గాయాలు మీడియా కంట పడటంతో అదికాస్తా హత్య అని తేలేదాకా వెళ్లింది. సాయంత్రానికి వైఎస్ వివేకాది హత్యే అని తేల్చడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు విచారణలో ఉండగానే కడప ఎస్సై బదిలీ కావడం.. వైఎస్ వివేకా కుమార్తె పలు మార్లు మాట మార్చడం.. దీని వెనక టీడీపీ నేతల హస్తం ఉందంటూ జగన్ ఆరోపించడం జరిగాయి. చంద్రబాబు కూడా ఎదురుదాడికి దిగడంతో సీన్ రివర్స్ అయింది. దీంతో వైఎస్ కుటుంబ సభ్యులు.. కోర్టుకు వెళ్లి.. ఈ హత్య విషయాన్ని ప్రచారాల్లో మాట్లాడకూడదంటూ తీర్పు తెప్పించుకున్నారు. 

ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారనే కారణంగా ఎర్ర గంగిరెడ్డి, ఏపీ క్రిష్ణారెడ్డి, డ్రైవర్‌ ప్రసాద్‌బాబులపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే. కాగా ఈ కేసులో ఈ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు. వీరు ప్రస్తుతం కడప సెంట్రల్‌ జైలులో ఉంటున్నారు. ఈ కేసు విచారణ పులివెందుల కోర్టులో జరుగుతోంది. అయితే పులివెందుల మేజిస్రేట్‌ సెలవుపై వెళ్లగా ఇన్‌చార్జిగా జమ్మలమడుగు మేజిస్ట్రేట్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే జమ్మలమడుగు మేజిస్ట్రేట్‌ కూడా సెలవుపై వెళ్లడంతో రిమాండు పొడిగింపు నిమిత్తం పోలీసులు ప్రత్యేక బందోబస్తుతో ప్రొద్దుటూరు కోర్టుకు ముగ్గురు నిందితులను తీసుకొచ్చారు. సెకండ్‌ ఏడీఎం కోర్టులో మేజిస్ట్రేట్‌ ముందు నిందితులు ఎర్రగంగిరెడ్డి, పీఏ క్రిష్ణారెడ్డి, డ్రైవర్‌ ప్రసాద్‌బాబులను హాజరుపరచగా సెకండ్‌ ఏడీఎం తదుపరి విచారణ మే 6కు వాయిదా వేసినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. దీంతో నిందితులను తిరిగి కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు.