Skip to main content
Latest News

అబార్షన్ చేయించుకోవాలని నిర్ణయించుకుంటే.. వీటి గురించి ఆలోచించండి..

తల్లి కావడమనేది ఒక మహిళకు ప్రపంచంలో అత్యుత్తమమైన ఆనందం. కానీ కొంతమంది మహిళలు ఈ అదృష్టానికి నోచుకోలేరు. దీనికి వివిధ కారణాలు ఉంటాయి. ఒక స్త్రీ శరీరం బిడ్డకు జన్మనివ్వడానికి వీలుగా నిర్మితమై ఉంటుంది. కానీ కొన్ని క్లిష్టమైన సందర్భాల్లో ఈ గర్భం, తల్లి ప్రాణాలకు గండంగా మారవచ్చు. అటువంటి సందర్భాల్లో ఆమె ప్రాణాన్ని రక్షించడానికి గర్భస్రావం చేస్తారు. సాధారణంగా గర్భస్రావం అనేది వైద్యపరమైన కారణాల వలన తల్లి ఆరోగ్యానికి హాని కలిగే అవకాశాలున్నా లేదా ఎటువంటి ప్రణాళిక లేకుండా గర్భం కలగడం వంటి ఇతర కారణాల వలన, గర్భానికి బలవంతంగా ముగింపు పలికే ప్రక్రియ.

నేటి మహిళలు ఏ నిర్ణయాన్ని అయినా కూడా స్వతంత్రంగా తీసుకునే స్థాయిలో ఉన్నారు. ఎటువంటి ప్రణాళిక లేకుండా , వారు ఊహించని సమయంలో గర్భం ధరిస్తే, ఆ బాధ్యత తలకెత్తుకోవడానికి వారు ఇష్టపడటంలేదు. అటువంటి పరిస్థితులలో వారు గర్భస్రావం చేయించుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. గర్భస్రావానికి పాలై కారణాలు ఉన్నప్పటికీ, మన దేశంలో ఇప్పటికీ అది బహిరంగంగా చర్చించలేని సున్నితమైన అంశమే! మన పూర్వీకులు ఈ పదాన్ని ఉచ్ఛరించడానికికూడా అసహ్యించుకునేవారు ఎందుకంటే ఇది స్త్రీల శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుంది. గర్భం దాల్చిన 9 వారాల లోపైతే మందులతో గర్భస్రావానికి ప్రయత్నించొచ్చు. అయితే మందులతో పిండం పూర్తిగా బయటకు వస్తుందని కచ్చితంగా చెప్పలేం. ఒకవేళ ఏవైనా ముక్కలు లోపల మిగిలిపోతే గర్భసంచిని శుభ్రం చేయాల్సి వస్తుంది. గర్భం ధరించి 9 వారాలు దాటితే సర్జరీ ద్వారా అబార్షన్‌ చేయాల్సి ఉంటుంది. పద్ధతి ఏదైనా గానీ- గర్భసంచి లోపల ఏమైనా ఇన్‌ఫెక్షన్‌ తలెత్తితే అండనాళాలు మూసుకుపోయే ప్రమాదముంది. అదే జరిగితే తిరిగి గర్భం ధరించటం కష్టమవుతుంది.

 గర్భసంచిని శుభ్రం చేసేటప్పుడు లోపలి పొర ఎక్కడైనా దెబ్బతింటే అది గర్భసంచి కండరంలోకి చొచ్చుకుపోయి అడినోమయోసిస్‌ అనే సమస్యకు దారితీయొచ్చు. దీని మూలంగా నెలసరి సమయంలో నొప్పి ఎక్కువగా రావటం, రుతుస్రావం అధికంగా అవటం, సంతానం కలగకపోవటం వంటి దుష్ప్రభావాలు తలెత్తే అవకాశముంది. కాబట్టి ఇలాంటి అన్ని విషయాలను, సమస్యలను దృష్టిలో పెట్టుకొని అబార్షన్ నిర్ణయం తీసుకోవటం మంచిది. ఒకవేళ అబార్షన్‌ చేయించుకోవాలని అనుకుంటే నైపుణ్యం గల డాక్టర్లనే సంప్రతించాలి. అన్ని సదుపాయాలు గల ఆసుపత్రుల్లోనే చేయించుకోవాలి. ఎందుకంటే గర్భసంచిని శుభ్రం చేసే సమయంలో అరుదుగా కొన్నిసార్లు లోపల రంధ్రం పడొచ్చు. అప్పుడు వెంటనే సర్జరీ చేసి రంధ్రాన్ని మూసేయాల్సి ఉంటుంది. అలాగే ఆసుపత్రికి అబార్షన్లు చేయటానికి అనుమతి ఉందో లేదో కూడా చూసుకోవాలి.

మరిన్ని చిట్కాల కొరకు మా స్త్రీల కొరకు పేజీ ని వీక్షించండి!

Ladies Special