Skip to main content
Latest News

పాలివ్వడం బిడ్డలకే కాదు.. తల్లులకే ఎంతో మేలు.. 

తల్లిపాలు బిడ్డకు సర్వరోగ నివారిణిగా పనిచేస్తాయి. ఇప్పటికీ అనేక మంది తల్లులు బిడ్డలకు పాలు పట్టడంపై అనేక అపోహలు కలిగిఉన్నారు. విజ్ఞానం పెరుగుతున్నా తల్లిపాల పట్ల అవగాహన పెరగడం లేదు. పోతపాల వల్ల కలుగే అనర్థాలు తెలిసినా కొందరు వాటివైపు మొగ్గుచూపుతున్నారు. పోతపాల వల్ల శ్వాసకోశ, ఉదర సంబంధమైన వ్యాధులు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. తల్లిపాలు బిడ్డకు అత్యంత శ్రేష్టమని, పుట్టిన గంటలోపు ముర్రుపాలు ఇవ్వడం బిడ్డకు ఎంతో మేలని చెబుతున్నారు. ప్రతిరోజూ పదిసార్ల వరకు తల్లిపాలు అందించాలని, ఆరునెలల పాటు తప్పనిసరిగా ఇవ్వాలని సూచిస్తున్నారు. 

తల్లిపాలల్లో విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, లాక్టోఫెరిన్‌, కోలోస్ట్రం, హార్మోన్లు, రోగనిరోధ బ్యాక్టీరీయాలు ఉండి పిల్లల ఎత్తు, బరువు పెరగడంతోపాటు మెదడు చురుకుగా పనిచేస్తుందని, తల్లిపాలు త్వరగా జీర్ణమవుతాయని వైద్యులు వివరిస్తున్నారు. మరోవైపు బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల తల్లులకు ఎన్నో ఉపయోగాలున్నాయని చెబుతున్నారు. వివిధ రకాల వ్యాధుల నుంచి గట్టెక్కుతారని, అండాశయం, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ నుంచి రక్షణ పొందుతారని తెలుపుతున్నారు. కృత్రిమ పాలపొడులు, పోతపాల వల్ల నెమ్ము, అతిసారం, అలర్జీ తదితర వ్యాధులు సంభవిస్తున్నాయి. తల్లిపాలు, పోతపాలు తాగిన పిల్లల్లో ఎన్నో రకాల వ్యత్యాసాలు కనిపిస్తాయి. ఆరోగ్యపరంగా, ఎత్తుపరంగా తల్లిపాలు తాగిన పిల్లలు ముందువరసలో ఉంటారు. 

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను అగస్టు 1వ తేది నుంచి 7వ తేది వరకు వారం రోజుల పాటు నిర్వహిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలతో పాటు ఆరోగ్య కేంద్రాల్లో వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నారు. తల్లిపాల అవశ్యకతపై ప్రపంచ ఆరోగ్య సంస్థ విస్తృత ప్రచారం చేపడుతోంది. 1992లో ఐక్యరాజ్యసమితి ఆగస్టు1వ తేది ని ప్రపంచ తల్లిపాల దినోత్సవంగా ప్రకటించి దాదాపు 210 దేశాల్లో అమలు చేస్తోంది. జిల్లాలోని 17 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో తల్లిపాల వారోత్సవాలను కట్టుదిట్టంగా జరపాలని ఆదేశాలు వచ్చాయి. వీటి పరిధిలో 5126 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 840 మినీ అంగన్‌వాడీ కేంద్రాన్నాయి. జిల్లాలో మూడేళ్ల వయస్సు ఉన్న పిల్ల లు 1,75,121 మంది, ఆరు ఏళ్లలోపు పిల్లలు 1,09,662 మంది ఉన్నారు. గర్భవతులు, బాలింతలు దాదాపు 65 వేల మంది ఉన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సదస్సులు, ప్రదర్శనలు జరిపి తల్లి పాల ప్రాధాన్యాన్ని వివరించనున్నారు. తల్లిపాల పట్ల గర్భవతులు, బాలింతలకు వివరించి చైతన్యం చేయడంతో పాటు తల్లిపాలను  పిల్లలకు పట్టకపోవడం వల్ల వచ్చే దుష్ఫలితాలను తెలియచేయనున్నారు. 

మరిన్ని చిట్కాల కొరకు మా స్త్రీల కొరకు పేజీ ని వీక్షించండి!

ladies special