Skip to main content
Latest News

స్త్రీలకు నెలసరి ఆలస్యం.. అసలు కారణాలేంటంటే..

నెలసరి ఆలస్యమవటానికి గర్భమే కారణం కానక్కర్లేదు. ఇందుకు ఎన్నో శారీరక, మానసిక కారణాలుంటాయి. సాధారణంగా స్త్రీ జీవితంలో రెండు సందర్భాల్లో మాత్రమే నెలసరి సమస్యలొస్తాయు. అవి... నెలసరి ప్రారంభంలో, మెనోపాజ్‌ దశలో. ఈ రెండు సందర్భాలు మినహా నెలసరి తేదీల్లో ఎప్పుడు హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నా ఈ క్రింది కారణాల మీద దృష్టి పెట్టాలి. స్త్రీలలో రుతుక్రమం చక్కటి ఆరోగ్యానికి నిదర్శనం. అలాంటిది నేటి కాలంలో ప్రతి 10 మందిలో స్త్రీలలో 9 మంది వరకు తమ జీవితకాలంలో ఏదో ఒక రుతుచక్ర సమస్యతో బాధపడుతూ ఉంటారు. వీటి వలన మానసిక ఆందోళన, నీరసం, పని మీద ఏక్రాగత కోల్పోవడం జరుగుతుంది. సాధారణంగా రుతుచక్రంలో మార్పులు- రజస్వల, ప్రెగ్నెన్సీ, ప్రసవం, రుతుచక్రం ఆగిపోయే సమయం వరకూ కనిపిస్తాయి. వీటన్నిటికీ ఎలాంటి వైద్యం అవసరం లేదు. కానీ ఇవి కాకుండా అనేక కారణాల వల్ల రుతుచక్ర సమస్యలు వస్తూంటాయి. వాటిల్లో కొన్ని..
 
అధిక ఒత్తిడి: కొంతకాలంపాటు ఒత్తిడి కొనసాగితే, మహిళల శరీరం ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి అవసరమయ్యే శక్తి కోసం అండాల విడుదలను ఆపేస్తుంది. ఏదైనా జరగకూడనిది జరిగినా, అడ్రినలిన్‌ అవసరానికి మించి స్రవించి, దాని ప్రభావం వల్ల ఈస్ట్రోజెన్‌, పునరుత్పత్తి హార్మోన్ల స్రావాల్లో తేడా రావొచ్చు. ఈస్ట్రోజెన్‌ తగినంత లేనప్పుడు గర్భాశయంలో పలచని పొర ఏర్పడే పరిస్థితి ఉండదు. ఫలితంగా నెలసరి రాదు.
 
ఆహార లోపం: యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు, ప్రోబయాటిక్స్‌ లోపించిన, ఉత్ర్పేరకాలు ఎక్కువగా ఉన్న డైట్‌ వల్ల అడ్రినలిన్‌, థైరాయిడ్‌ గ్రంథులు దెబ్బ తింటాయి. ఉదాహరణకు చక్కెరలు ఎక్కువగా ఉండి, హైడ్రోజెనేటెడ్‌ ఫ్యాట్స్‌, కృత్రిమ రంగులు, పురుగు మందులు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల థైరాయిడ్‌, అడ్రినల్‌ సమస్యలు తలెత్తుతాయి. కార్టిసాల్‌ స్రావం పెరిగితే మిగతా హార్మోన్లు, మరీ ముఖ్యంగా సెక్సువల్‌ హార్మోన్ల ప్రభావం కుంటుపడుతుంది.
 
బరువు తగ్గడం: మీ బాడీ మాస్‌ ఇండెక్స్‌ 18 - 19 కంటే తక్కువకు పడిపోతే, శరీరంలో కొవ్వు కూడా తగ్గుతుంది కాబట్టి ఆ ప్రభావం నెలసరి మీద కూడా పడుతుంది. తగినంత ఈస్ట్రోజెన్‌ తయారీకి శరీర కొవ్వు ఎంతో అవసరం. విపరీతమైన శారీరక శ్రమ వల్ల, పెరుగుతున్న పోషకాల అవసరం తీరకపోవడం వల్ల కూడా శరీర బరువు తగ్గి హార్మోన్ల అసమతౌల్యత కూడా ఏర్పడుతుంది.
 
థైరాయిడ్‌ సమస్యలు: 15% మంది మహిళల ‘అనరోయియా’ (నెలసరి సమస్య)కు థైరాయిడ్‌ గ్రంథి సమస్యలే కారణం. కాబట్టి హైపో, హైపర్‌ థైరాయిడ్‌ సమస్య ఉందేమో లక్షణాలను బట్టి గ్రహించి చికిత్స తీసుకోవాలి.

మరిన్ని చిట్కాల కొరకు మా స్త్రీల కొరకు పేజీ ని వీక్షించండి!

Ladies Special