Latest News

తెరాస ను గెలిపిస్తే..సమస్యలు పరిష్కరిస్తా:  కెసిఆర్

"ఈ సభకు పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలను చూస్తుంటే కొడంగల్ తెరాస అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి గెలిచినట్లే" అని కొడంగల్‌లోని కోస్గిలో తెరాస ప్రజాఆశీర్వాద సభలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌  అన్నారు.  నరేందర్ రెడ్డిని గెలిపిస్తే కోడంగల్ అభివృద్ధి చేసే భాద్యత తనదేనని కెసిఆర్ అన్నారు.  “58 ఏళ్ల కాంగ్రెస్‌, తెదేపా పాలన లో ఎలాంటి సంక్షేమం వుంది? ఆనాడు పెన్షన్‌ ఎంత? ఆరోజు వారు పంపిణీ చేసిన బియ్యం ఎన్ని? ఇప్పుడెలా ఇస్తున్నామో ప్రజలకు తెలుసు.” గతంలో గర్భిణుల ప్రసవానికి వెళ్తే డబ్బు ఖర్చయ్యేదనీ, నేడు ప్రభుత్వమే గర్భిణులకు ప్రసవాలు చేయించి, డబ్బులిచ్చి, బిడ్డలతో పాటు అమ్మ ఒడి వాహనంలో వారిని ఇంటికి చేరుస్తోందని కెసిఆర్ అన్నారు.  మిషన్‌ భగీరథతో ఇంటింటికీ నీళ్లు ఇస్తున్నామనీ, వాస్తవాలను గమనించి ఈసారి తెరాసను దీవిస్తే, ఆసరా పింఛన్లను రెట్టింపు చేస్తామనీ కెసిఆర్ తెలిపారు.  నిరుద్యోగ యువకులకు రూ.3వేలు నిరుద్యోగ భృతి, 24గంటల పాటు విద్యుత్‌, రైతులకు రైతుబంధుతో పాటు రైతు బీమా కల్పిస్తున్నాం.  పేదలు, దళితులు, మైనార్టీల గురించి మేం పట్టించుకున్నాం. మైనార్టీలకు రెసిడెన్షియల్‌ పాఠశాలలు నిర్మించాం. పండగలు వస్తే అందరినీ గౌరవిస్తున్నాం. కులం, మతం, జాతి వివక్షలేకుండా అందరి గురించి కార్యక్రమాలు చేపడతాం అని అయన హామీ ఇచ్చారు.   పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కు రూ.35వేల కోట్లు మంజూరు చేశాం అనీ, అది పూర్తయితే 20లక్షల ఎకరాలకు నీరు అంది ఆకుపచ్చ పాలమూరుగా మారుతుందనీ, అదే ప్రజా కూటమి గెలిస్తే పాలమూరు ప్రాజెక్టు నీళ్లు ఆపేస్తారని కెసిఆర్ అన్నారు. తెరాసను గెలిపిస్తే తానే స్వయంగా వచ్చి, సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని, సాగునీరు, విద్యా సంస్థలు తీసుకొస్తామని, కొడంగల్‌ను అభివృద్ధి చేసే బాధ్యత తమదేనని, నర్సింగ్‌, పాలిటెక్నిక్‌ కళాశాలు నెలలోపు ఏర్పాటు చేస్తామనీ కేసీఆర్‌ హామీ ఇచ్చారు.