Skip to main content
Latest News

‘జెర్సీ రీమేకా..? నా వల్ల కాదండీ బాబు..’

జెర్సీ.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదో హాట్‌టాపిక్.. నాని నటనకు సినీ విమర్శకులే ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాలుగు ఫైట్లు.. ఆరు పాటలు.. ఓ ఐటమ్ సాంగ్.. మధ్యమధ్యలో లాజిక్కులు లేని డబుల్ మీనింగ్ డైలాగులతో కామెడీ ట్రాకులు.. ఇవీ ఈ మధ్య వస్తున్న తెలుగు సినిమాల కథా నేపథ్యం.. ఇప్పుడు తరం మారింది.. హీరోల తీరు మారింది.. కథల ట్రెండ్ మారింది.. అర్జున్ రెడ్డి అంటూ బోల్డ్ నెస్‌తో సినిమా తీసినా.. ఆర్ఎక్స్ 100 అంటూ కొందరు అమ్మాయిల తీరును యదార్థంగా చూపించినా.. ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు.. అప్పుడెప్పుడో శంకరాభరణం సినిమా తరహా విధానం ఇప్పుడు కనిపిస్తోంది. పెద్ద పెద్ద స్టార్లు లేకున్నా ఆ సినిమా తెగ ఆడేసింది.. ఇప్పుడు కూడా అంతే కొత్త దర్శకుడైనా.. కొత్త హీరో అయినా కథ బాగుంటే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ కూడా ఈ కోవలోకే వస్తుంది. నేలవిడచి సాము చేయకుండా సింపుల్‌గా తెరకెక్కించి.. భావోద్వేగాలను పండించేలా కథనాన్ని క్రియేట్ చేసి.. సక్సెస్ కొట్టాడు జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి.. ఇటీవల విడుదలయిన ఈ సినిమాపై నెటిజన్లు.. టాలీవుడ్ అగ్రహీరోలు.. సినీ విమర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు గౌతమ్ ఓ ప్రైవేటు మీడియా చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 

నాని కెరీర్లోనే బెస్ట్ ఫిల్మ్ జెర్సీ కావడం తనకు చాలా ఆనందంగా ఉందని గౌతమ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జెర్సీ మూడ్‌లో ఉన్నాననీ.. తర్వాతి సినిమా గురించి త్వరలోనే ప్రకటన చేస్తానన్నారు. కథ బాగున్నాకే.. అన్నీ క్లియర్ అయ్యాకే తర్వాతి సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతానన్నారు. కథను బట్టి హీరోను సెలెక్ట్ చేసుకుంటాననీ. హీరోను బట్టి కథను రాయడం తనకు చేతకాదని చెబుతున్నారు. ఈ సినిమాను రీమేక్ చేస్తారా...? అంటూ అడిగిన ప్రశ్నకు గౌతమ్ విచిత్ర సమాధానమిచ్చారు. ‘ఇంత త్వరగా సినిమా రీమేక్‌ గురించి మాట్లాడలేం. ఇప్పటికైతే ఆ ఆలోచనలు లేవు.. రీమేక్ ఆఫర్లు వచ్చినా.. ఈ సినిమాకు మళ్లీ దర్శకత్వం వహించడం.. నా వల్ల కాదండి..’ అంటూ గౌతమ్ తేల్చిచెప్పారు.