Skip to main content
Latest News

భారత్‌-చైనాల మధ్య మరో వివాదం

భారత్‌-చైనాల మధ్య మరో వివాదం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. టిబెట్‌ నుంచి భారత్‌లోకి ప్రవహించే పలు నదీజలాల ప్రవాహ వివరాలను చైనా భారత్‌కు వెల్లడించడం లేదని తెలుస్తోంది. చైనా ఆధీనంలోని టిబెట్‌ హిమనీనదాల నుంచి బ్రహ్మపుత్ర, సింధు, సట్లెజ్‌... తదీతర నదులు ప్రవహిస్తుంటాయి. గతంలో కుదిరిన ఒప్పందం మేరకు నదీజలాల ప్రవాహ వివరాలను చైనా భారత్‌కు వెల్లడించాల్సివుంది. మే 15- అక్టోబరు 15 మధ్య ఈ నదులు భారీగా ప్రవహిస్తుంటాయి. దిగువ పరివాహకదేశమైన భారత్‌కు ముందస్తుగానే సమాచారం చెబితే ప్రవాహం పెరిగితే ముందుస్తు హెచ్చరికలు జారీ చేయవచ్చు. దీంతో పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారిని తరలించడంతో పాటు ఆస్తినష్టాన్ని కూడా తగ్గించేందుకు అవకాశం కలుగుతుంది.

డోక్లాం ఘటనతో.. 
గత కొద్ది మాసాల ముందు భారత్‌, భూటాన్‌,చైనా సరిహద్దుల్లో డోక్లాం ఘటనతో రోడ్డు నిర్మాణానికి యత్నించిన చైనా అనంతరం వెనక్కు తగ్గింది. ఈ ఘటన అనంతరం నదీజలాల సమాచారాన్ని భారత్‌కు ఇవ్వడం మానివేసినట్టు తెలుస్తోంది. గతంలో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల మేరకు చైనా ప్రవాహ వివరాలను భారత్‌కు అందివ్వకపోవడం గమనార్హం.

చైనా కుంటిసాకులు.. 
అయితే ప్రవాహ వివరాలను ఎందుకు ఇవ్వలేదన్న అంశంపై చైనా చెబుతున్న కారణాలు సహేతుకంగా లేకపోవడం విశేషం. టిబెట్‌ ప్రాంతంలో ఉన్న నదీజలాల గణాంకాల కేంద్రాలు వరదల కారణంగా దెబ్బతిన్నాయని అందుకనే వివరాలను తెలుపలేదని చైనా వర్గాలు పేర్కొంటున్నాయి. కొద్ది రోజుల్లోనే వీటికి మరమ్మతులు చేపట్టనున్నట్టు చెప్పారు.

తీవ్రనష్టం.. 
నదీజలాల ప్రవాహ వివరాలు తెలియకపోవడంతో బ్రహ్మపుత్ర, సట్లెజ్‌కు మెరుపు వరదలు వచ్చిన సమయంలో అధికారులు సరైన రీతిలో స్పందించకపోయారు. అస్సాంలో బ్రహ్మపుత్ర వరదలకు 160 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్‌లో సట్లెజ్‌ నది పొంగడంతో దాదాపు 10 వేల ఎకరాలు నీటమునిగాయి. చైనా అధికారులు ఇకనయినా మేలుకొని వరద సమయాల్లో ముందస్తుగాన సమాచారాన్ని చెబితే ముందుస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని భారత వర్గాలు విజ్ఞప్తి చేశాయి.