Skip to main content
Latest News

అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం..

ప్రపంచవ్యాప్తంగా జరుపుకొన్న ఈస్టర్ వేడుకలు.. ఓ తెలుగు కుటుంబంలో విషాదాన్ని మిగిల్చాయి. అమెరికాలో చదువుకుంటూ.. ఈస్టర్ వేడుకల్లో ఫ్రెండ్స్‌తో కలిసి పాల్గొన్న ఓ తెలుగు కుర్రాడు అకాల మరణం చెందాడు.. ఫ్రెండ్స్‌తో కలిసి బీచ్‌కు వెళ్లిన తెలుగు విద్యార్థి మృత్యువాతపడ్డాడు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన శ్రావణ్‌కుమార్ ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లాడు.. బోస్టన్‌లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ఈస్టర్ సందర్భంగా వారంతా బీచ్‌కు వెళ్లారు.. హోరెత్తిపోతున్న అలల్లోనే వారంతా ఈత ప్రారంభించారు. అలల ఉధృతి పెరగడంతో.. చుట్టూ స్నానం చేస్తున్న వారంతా బయటకు వచ్చారు.. అయితే ఈ క్రమంలోనే శ్రావణ్ సముద్రంలో గల్లంతయ్యాడు. దీన్ని గమనించిన స్నేహితులు వెంటనే స్థానిక ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అలల ఉధృతికి సముద్రంలో గల్లంతయిన అతని కోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు సోమవారం శ్రావణ్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న శ్రావణ్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని త్వరగా స్వస్థలానికి రప్పించాలని వారు వేడుకుంటున్నారు.