Skip to main content
Latest News

ఇంటర్ విద్యార్థులకు రామ్ సూపర్బ్ మెసేజ్

తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది.. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న ఆవేదనతో ఇప్పటికే 20మందికి పైగా విద్యార్థులు తమ ఉసురు తీసుకున్నారు. ఇంటర్ బోర్డు కూడా దారుణంగా వైఫల్యం చెందింది. 900కు పైగా మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా ఓ సబ్జెక్టులో.. అది కూడా తెలుగులో సున్నా మార్కులు పొందారంటూ మెమోలు చూపించడంతో ఖంగుతిన్నారు. పాస్, ఫెయిల్, ఆబ్సెంట్‌తోపాటు.. ఆబ్సెంట్ పాస్, ఆబ్సెంట్ ఫెయిల్ అంటూ కొత్త కొత్త కోడ్ పదాలు వాడారు. మరికొన్ని చోట్ల 17 మార్కులు వచ్చిన విద్యార్థులను కూడా పాస్ అంటూ చూపించారు. లక్షల సంఖ్యలో విద్యార్థులు తమకు అన్యాయం జరిగిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు రణరంగంగా మారిపోయింది. తప్పకుండా పాస్ అవుతా.. నూటికి నూరుశాతం ఫస్ట్ క్లాస్ వస్తుందంటూ ధీమా వ్యక్తం చేసిన విద్యార్థులు.. తీరా ఫలితాలు చూశాక ఫెయిల్ అయినట్లు కనిపించడంతో నిరాశలోకి వెళ్లిపోతున్నారు. ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. వీరిలో హీరో రామ్ వినూత్న రీతిలో విద్యార్థులకు ఓ మెసేజ్ ఇచ్చారు. 

‘ఇంటర్ ఫలితాలే జీవితం అనుకునే నా తమ్ముళ్లకు, చెల్లెళ్లకు.. మీరు జీవితంలో అవ్వబోయే దానికి, చేయబోయేదానికి ఇది కాలిగోటితో సమానం. దయచేసి లైట్ తీసుకోండి.. ఇట్లు ఇంటర్ కూడా పూర్తి చేయని మీ రామ్ పోతినేని.. ఇంటర్ కూడా పూర్తి చేయని సచిన్ థెందూల్కర్‌కు జన్మదిన శుభాకాంక్షలు.. పార్కులో కూర్చుని బిస్కట్లు తినే పిల్లలకి ఎలా చెప్పినా వింటారు. బెడ్రూం లాక్ చేసుకుని లైఫ్ ఎలా రా అనుకునే పిల్లలకి నిజాలు ఇలా చెబితేనే వింటారు..’ అంటూ రామ్ ట్వీట్ చేశాడు.