Skip to main content
Latest News

క్యూలో నిలబడి మరీ స్వామీజీతో తన్నించుకుంటున్నారు..

ఆచారమనుకుంటారో.. మూఢ నమ్మకమనుకుంటారో మీ ఇష్టం.. ఒక్కో చోట ఒక్కో వింత పద్ధతులు ఉంటుంటాయి. కోరికలు తీర్చమని కొందరు నిప్పుల్లో నడుస్తుంటారు.. మరికొందరు నాలుకకు సూది గుచ్చుకుంటారు. కర్ణాటకలో చిన్న పిల్లల్ని తొక్కుతూ పోయే బాబా గురించి మీరు చదివే ఉంటారు.. రెండు చేతుల్తో హత్తుకుని.. చుట్టేసి ఒంటి నొప్పుల్ని తగ్గించే బాబా గురించి వినే ఉంటారు.. ఏపీలోనూ ఇలాంటి ఓ వింత ఆచారం గురించి సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది.. కాలితో తన్నించుకుంటే కోరిన కోరికలన్నీ తీరిపోతాయన్నది కర్నూలు జిల్లాలోని చిన్న హోతూర్ గ్రామంలోని వింత నమ్మకం.. 

కర్నూలు జిల్లాలోని చిన్న హోతూర్ గ్రామంలోని శివ యోగి సిద్ధ రామేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏటా చైత్రపౌర్ణమి రోజు ఓ ఉత్సవం జరుగుతుంది. అంగరంగ వైభవంగా రథోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహిస్తారు. ఈ సారి కూడా అలాగే భారీ ఎత్తున నిర్వహించారు. ఉత్సవం చివరగా శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులు వరుసగా నిలబడ్డారు.. కొత్తగా వచ్చినవాళ్లు ఆశ్చర్యంతో అలా ఎందుకు నిలబడ్డారా..? అని చూస్తూ ఉండగా.. ఓ పూజారి బయటకు వచ్చారు. ఓ పూజారి వీరభద్రస్వామి వేషధారణలో నాట్యం చేస్తూ పూనకం వచ్చినట్టుగా ఊగిపోయారు. ఆ సమయంలో ఆ పూజారి ఎవరినైనా కాలితో తన్నితే వారికి రాజభోగం పట్టినట్లేనట.. పూజారి నడుస్తూ.. అప్పుడప్పుడు ఒక్కొక్కరిని కాలితో తన్నుతూ ముందుకు వెళ్లారు. ఉత్సవం పూర్తయ్యాక పూజారి కాలిదెబ్బ తగలని వారు కొంచెం నిరుత్సాహ పడుతూ ఇంటికి వెళ్లారు.. ఇలా ఉత్సవం రోజున వీరభద్రస్వామి చేత తన్నులు తింటే తాము కోరిన కోర్కెలు నెరవేరతాయని నమ్మకం. ఈ నమ్మకం ఆ చుట్టుపక్కల గ్రామాలకు మాత్రమే పరిమితం కాదు. కర్ణాటకలోని హంపి, హోస్పేట నుంచి కూడా ఇక్కడకు భక్తులు వచ్చి స్వామివారి ‘తన్నుల’ కోసం క్యూలో నిలబడతారట.. ఏది ఏమైనా.. ఈ వింత ఆచారం మాత్రం విచిత్రంగా ఉందని హేతువాదులు చెప్పుకుంటున్నారు.