Skip to main content
Latest News

17 మార్కులు వచ్చినా పాస్.. ఇంటర్ బోర్డు ఘనకార్యమిదీ..!

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన పొరపాట్లతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 900కుపైగా మార్కులు వచ్చినా కానీ.. ఓ సబ్జెక్టులో సున్నా మార్కులను చూపిస్తూ ఫెయిల్ అని చెప్పడం.. అర్థం కాని కోడ్ బాషలను ఉపయోగించడం... లక్షలాది మంది ఫెయిల్ అవడంతో.. విద్యార్థులంతా ఇంటర్ బోర్డు వద్దకు క్యూ కడుతున్నారు. తల్లిదండ్రులు, విద్యార్థుల, సామాజిక ఉద్యమకారులతో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద పరిస్థితులు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఇంత జరిగినా ప్రభుత్వం కిక్కురుమనకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద మంగళవారం కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. బాధిత విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నాయకుల ఆందోళనతో ఆ ప్రాంతం అట్టుడికింది. ఇంటర్‌ ఫలితాల్లో తమకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని అధికారులను వేడుకొనేందుకు వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి ఠాణాలకు తరలించారు. ‘మేము రాజకీయ నాయకులం కాదు.. ఉద్యమకారులం కాదు. ఉగ్రవాదులం అంతకన్నా కాదు. విద్యార్థులం మాత్రమే. ఇంటర్‌ ఫలితాల్లో అన్యాయం జరిగింది.. న్యాయం చేయండి’ అని వేడుకున్నా వినే పరిస్థితి అక్కడ లేదు.. తాజాగా ఇంటర్ బోర్డు నిర్లక్ష్యానికి మరో ప్రత్యక్ష ఉదాహరణ లభించింది. ఇంటర్మీడియెట్‌ బోర్డు బాగోతాల్లో ఇది మరొకటి. ఇంటర్‌ మొదటి సంవత్సరం ఎంఈసీ పరీక్షలు రాసిన భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు చెందిన సాత్విక్‌కు గణితం 1(ఎ)లో 17 మార్కులు రాగా ఇంటర్‌బోర్డు పాసయినట్టు ఫలితమిచ్చింది. వాస్తవానికి 27 మార్కులు వస్తేనే ఉత్తీర్ణత లభిస్తుంది. ఇతడు కొత్తగూడెంలోని ఓ కళాశాలలో చదువుతున్నాడు.