Skip to main content
Latest News

డీజీపీ సాంబశివరావుకు వీడ్కోలు

పదవీ విరమణ చేసిన ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ సాంబశివరావుకు పోలీసు శాఖ ఘనంగా వీడ్కోలు పలికింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆరో బెటాలియన్‌లో ఏర్పాటు చేసిన పరేడ్‌కు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది  సహా నూతన డీజీపీ మాలకొండయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసు దళాల గౌరవ వందనాన్ని డీజీపీ స్వీకరించారు.

ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ.. ‘నా 33ఏళ్ల  సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా. విధి నిర్వహణలో ఎవరినీ ఎప్పుడూ ఇబ్బందులకు గురి చేయలేదు. నాకు చదువు చెప్పిన గురువులకు పాదాభివందనాలు సమర్పిస్తున్నా. పాఠశాల విద్య అభ్యసించే సమయంలో గురువు రామకృష్ణ ప్రోద్బలంతో నాలో ఉన్న సామర్థ్యం గుర్తించా. మొట్టమొదటి సారిగా బెల్లంకొండలో ఏఎస్పీగా విధుల్లో చేరా. ఉమేష్ చంద్ర, వ్యాస్ త్యాగాలు పోలీసులు మరువలేనివి. తీవ్రవాద సమస్య తీవ్రంగా ఉన్న కాలంలో ఎంతోమంది పోలీసులు ప్రాణాలు పణంగా పెట్టారు. దేశస్థాయిలో క్లిష్టమైన పరిస్థితులు  ఎదుర్కోవడంలో ఏపీ పోలీసులు ప్రత్యేక మార్క్ సంపాదించారు. నా మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో నమ్మకం ఉంచి కట్టబెట్టిన ప్రతి బాధ్యతను సమర్థంగా నిర్వహించా’ అన్నారు.

పదవీ విరమణ చేస్తున్న సాంబశివరావు చాలా నిబద్ధత కలిగిన వ్యక్తి అని నూతన డీజీపీ ఎం.మాలకొండయ్య కొనియాడారు. రాష్ట్ర శాంతి భద్రతల విషయంలో సాంబశివరావు సలహాలు, సూచనలు తీసుకుంటానని, ఆయన విశ్రాంత జీవితం ఆయురారోగ్యాలతో సంపూర్ణంగా గడపాలని దేవుడిని కోరుకుంటున్నట్లు నూతన డీజీపీ ఆకాక్షించారు.