Skip to main content
Latest News

పెళ్లికి ముందే భర్తకు ఉన్న అఫైర్ గురించి భార్యకు తెలియడంతో.. 

తన భర్త తనకు కావాలంటూ ఓ వివాహిత అత్తింటి ఎదుట ఆందోళన చేపట్టిన సంఘటన ఆదివారం ఖమ్మం జిల్లా పాల్వంచలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన సునితకు పాల్వంచ మండలం ఇందిరానగర్‌ కాలనీకి చెందిన వాసుతో గతేడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. వీరికి ఆరు నెలల పాప ఉంది. వాసు ఓ లారీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. వివాహమైన కొన్నాళ్ల తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. తరుచూ గొడవ పడేవారు. పాప పుట్టినప్పటి నుంచి భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. అనేక మార్లు చిత్రహింసలకు గురి చేశాడు. పెళ్లికి ముందే ఖమ్మంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు, ఆ మహిళకు ఒక కూతురు కూడా ఉంది. ఆ విషయాన్ని కప్పిపుచ్చి సునీతను వివాహం చేసుకున్నాడు.

భర్త తీరుతో విసుగు చెందిన ఆమె కొద్దిరోజుల క్రితం సునిత పుట్టింటికి వెళ్లింది.. ఎన్ని రోజులయినా భర్త తీరులో మార్పు రాకపోవడంతో.. సునిత పాల్వంచ ఇందిరాకాలనీలోని తన అత్తవారి ఇంటి ఎదుట న్యాయం కోసం తన కుటుంబసభ్యులతో కలిసి బైఠాయించింది. దీంతో అత్తమామ, మరిది తదితరులు ఆమెకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. వారి మధ్య వాదోపవాదాలు తారాస్ధాయికి చేరుకుని ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ‘ఆడపిల్ల పుట్టడం నా భర్తకు ఇష్టం లేదు. అందువల్లనే నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు. న్యాయం చేయాలని బూర్గంపాడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయిందని’ సునీత ఆరోపిస్తోంది. ఖమ్మంలో నివసిస్తున్న ఆ మహిళను ఈ మధ్యకాలంలో పాల్వంచకు తీసుకువ చ్చాడని సునీత విలేకరుల ఎదుట వాపోయింది. తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్‌ చేసింది. సమాచారం అందుకున్న ఖమ్మం పట్టణ పోలీసులు సునితను అక్కడ్నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. భర్త వద్దే ఉంటానంటూ ఆమె భీష్మించుకు కూర్చుంది. దీంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించిన పోలీసులు వెనుదిరిగి వెళ్లిపోయారు.