Skip to main content
Latest News

భార్య తల నరికిన భర్త.. షాకింగ్ ట్విస్ట్.. సీసీ కెమెరాలో మరో ఇద్దరు..

నడిరోడ్డుపై భార్యను హత్య చేసిన భర్త కేసులో కొత్త ట్విస్ట్. ఆమెను హత్య చేసింది భర్త ఒక్కడే కాదు.. మరో ఇద్దరు కూడా అతడికి సహకరించారు. భార్య కాళ్లు, చేతుల్ని ఆ ఇద్దరు పట్టుకుంటే.. ఆ భర్త నిర్దాక్ష్యిణ్యంగా భార్యను హతమార్చాడు. తల నరికి రోడ్డుపైకి వచ్చాడు. ఆ తర్వాత వారిద్దరూ స్కూటీపై వెళ్లిపోయారు... ఇదీ విజయవాడలో దారుణ హత్యకు గురైన మణిక్రాంతి సోదరి పూజారాణి చెబుతున్న కొత్త విషయం. తనకు ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షులే చెప్పారనీ.. ఈ కోణంలో కూడా విచారణ జరపాలంటూ ఆమె పోలీసులను కోరుతోంది. సోదరి భర్త ప్రదీప్ కుమార్ బంధువులే అయి ఉంటారనీ.. వారిద్దరూ ఎవరో తేల్చాలని కోరుతోంది. మణిక్రాంతి సోదరి పూజారాణి సోమవారం ఈ సంచలన ఆరోపణలు చేసింది. 

మణిక్రాంతిని చంపుతుండగా స్థానికంగా ఉన్న వాళ్లు కొంతమంది చూశారని, వాళ్లు తమకు ఈ విషయం చెప్పారని పూజారాణి చెబుతోంది. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. ప్రదీప్‌కుమార్‌ ఒక్కడే మణిక్రాంతిని చంపాడని చెబుతున్నారు. ఆ వీధిలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తే హత్య జరిగిన వెంటనే ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వెళ్లిపోతున్నట్టు కనిపిస్తోంది. ఇద్దరూ తలపై టోపీ పెట్టుకుని ఉన్నారు. వాళ్లిద్దరూ ప్రదీప్‌కుమార్‌ బంధువులని పూజారాణి ఆరోపిస్తోంది. బంధువుల సహకారం లేకుండా ప్రదీప్‌ ఈ ఘాతుకానికి ఒడిగట్టడని మణిక్రాంతి తల్లి లక్ష్మి, సోదరి పూజారాణి మొదటి నుంచీ ఆరోపిస్తున్నారు. దీన్ని పోలీసులు కొట్టిపారేస్తున్నారు. ప్రదీప్‌కుమార్‌ ఒక్కడే మణిక్రాంతి ఇంటి వద్దకు వచ్చాడని చెబుతున్నారు.

ప్రదీప్‌ లోగడ క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో పరిచయమైన మరో డ్రైవర్‌ క్యాబ్‌లో శ్రీనగర్‌ కాలనీలోని నాలుగో వీధిలోకి వచ్చాడని, ఆమె మార్కెట్‌ నుంచి వచ్చే వరకు అక్కడే కాపు కాశాడని ఓ పోలీసు అధికారి చెబుతున్నారు. సీసీ కెమెరా ఫుటేజీలో కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తుల విషయమే ఇప్పుడు అనుమానాస్పదంగా మారింది. స్కూటీ నంబర్‌ ప్లేట్‌ ఫుటేజీలో కనిపించకపోవడంతో దానిని మరింత డెవలప్‌ చేయడానికి సైబర్‌ల్యాబ్‌కు పంపారు. స్కూటీ రిజిస్ట్రేషన్‌ కనిపిస్తే ఆ చిక్కుముడి విడిపోతుందని అధికారులు భావిస్తున్నారు. మణిక్రాంతి కుటుంబ సభ్యులను, ఆరోపిస్తున్న బంధువులను పోలీసులు విచారిస్తున్నారని సమాచారం.

మరిన్ని క్రైమ్ వార్తల కొరకు మా క్రైమ్ న్యూస్ పేజీ నీ వీక్షించండి.

Crime Stories Telugu