Skip to main content
Latest News

భర్తతో గొడవలు.. పుట్టింటికి వచ్చి.. తెల్లవారుజామున నిప్పటించుకుంది..

అత్తింటి వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. పెళ్లయి ఏడాదిన్నర కూడా కాకముందే తనువు చాలించింది. పుట్టింటికి వచ్చి.. తనకు ఎంతో ఇష్టమైన తండ్రితో రాత్రంతా ముచ్చట్లు చెప్పుకుంటూ.. తండ్రి వద్దే నిద్రపోయి.. తెల్లవారు జామున ఆరు గంటలకు వేరే గదిలోకి వెళ్లి నిప్పింటించుకుంది. పొగలు రావడంతో.. బయటి నుంచి చూసిన కొందరు యువకులు వచ్చి కాపాడేలోపే.. ఆమె ప్రాణాలు కోల్పోయింది. కలకలం రేపిన ఈ ఘటన హైదరాబాద్‌లోని కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. కాచిగూడ ఇన్‌స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. 

బర్కత్‌పుర ఆర్టీసీ డిపో లైన్‌లో వి. ఎల్లయ్య, సత్తెమ్మ దంపతులు నివసిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చిన్న కుమార్తె గౌతమి(31)కి సికింద్రాబాద్‌ గాస్‌మండిలో ఉంటున్న కర్నె మధుకర్‌తో 14 నెలల క్రితం వివాహమైంది. అతడు ఓ కొరియర్‌ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా.. గౌతమి ఏపీఎస్‌సీఆర్‌ఐసీలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తోంది. వివాహ సమయంలో గౌతమి తల్లిదండ్రులు రూ. 15 లక్షల కట్నం ఇచ్చి రూ. 5 లక్షలు ఖర్చు చేసి ఘనంగా పెళ్లి జరిపించారు. వివాహం అయిన కొద్ది రోజులకే అత్త అరుణజ్యోతి, ఆడపడుచులు శిరీష, లత, స్వప్న, భర్త మధుకర్‌ గౌతమిని వేధిస్తుండేవారు. తల్లిదండ్రులు పండగలకు పబ్బాలకు కుమార్తెను పుట్టింటికి తీసుకొచ్చి తిరిగి వారే తీసుకెళ్లి దింపి వచ్చేవారు. అల్లుడిని రమ్మన్నా వచ్చేవాడు కాదు. పెళ్లి సమయంలో తమకు అబద్ధాలు చెప్పాడనీ.. డిగ్రీ చదివానని చెప్పి నమ్మించాడన్నది అత్తారింటి వాళ్ల కోపం. ఈ విషయమై గతంలో కొన్ని గొడవలు జరిగాయి. అయినప్పటికీ అల్లుడిని పండుగలకు పిలిచినా.. అతడు వచ్చేవాడు కాదు. 

ఈ క్రమంలోనే అత్త, భర్త, ఆడపడుచుల వేధింపులు అధికం కావడంతో జూలైలో బోనాల పండగకు పుట్టింటికి వెళ్లిన గౌతమి తిరిగి అత్తగారింటికి వెళ్లలేదు. దీంతో ఇటీవల వారు ఎల్లయ్య ఇంటికి వచ్చి గౌతమిని దుర్భాషలాడి మందలించి వెళ్లారు. దీంతో ఆమె మనస్తాపానికి గురైంది. మంగళవారం ఉదయం ఆమె తల్లి తమ ఇంటికి ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో పని చేయడానికి వెళ్లింది. తండ్రి ఎల్లయ్య నిద్రలో ఉన్నాడు. సోమవారం రాత్రంతా తండ్రితో కబుర్లు చెబుతూ, ఆయనతోపాటే నిద్రపోయింది. తెల్లవారు జామున వరకు తండ్రి పక్కనే నిద్రపోయిన గౌతమి ఉదయం 6 గంటలకు వేరే గదిలోకి వెళ్లి గడియపెట్టుకొని ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుంది. కిటికీ నుంచి పొగరావడం, ఆమె కేకలు వేయడంతో పక్కనే ఉన్న యువకులు తలుపులు పగులగొట్టి గదిలోకి వెళ్లి మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. అప్పటికే పూర్తిగా కాలిపోయి గౌతమి చనిపోయింది. సమాచారం అందుకున్న కాచిగూడ ఏసీపీ సుధాకర్‌, సీఐ హబీబుల్లాఖాన్‌, డీఐ యాదేందర్‌, అడ్మిన్‌ ఎస్‌ఐ లక్ష్మయ్య, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతురాలి భర్త, అత్త, ముగ్గురు ఆడపడుచులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ తెలిపారు. గౌతమిని వేధింపులకు గురి చేసి.. ఆత్మహత్యకు పాల్పడేలా చేసిన అత్తారింటి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

మరిన్ని క్రైమ్ వార్తల కొరకు మా క్రైమ్ న్యూస్ పేజీ నీ వీక్షించండి.

Crime Stories Telugu