
ఒక కోచింగ్ సెంటర్లో వారిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం ప్రేమగా మారింది. 5 నెలలు గడిచింది. ఇంతలోనే ఆమెపై అతను అనుమానం పెంచుకున్నాడు. తనతో సరిగా మాట్లాడడం లేదని ప్రేమోన్మాదిగా మారాడు. మాట్లాడుకుందామని నమ్మించి ఆమెను లాడ్జికి రప్పించాడు. లాడ్జికి రాగానే ఆమెతో గొడవకు దిగాడు. అతని తీరు చూసి అనుమానం వచ్చిన ఆమె తన సోదరుడికి ఫోన్ చేసింది. వారు ఇంటి నుంచి వచ్చేలోపే పథకం ప్రకారం ఆమెపై ఆ ప్రేమోన్మాది కత్తులతో దాడి చేసి గొంతు కోశాడు. అక్కడే అతను ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ దారుణం మంగళవారం హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ ఓయో బృందావన్ ప్రైడ్ లాడ్జిలో చోటుచేసుకుంది.
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వేమూరి ఆనంద్‌బాబు, కమలకుమారి దంపతులు కొంతకాలంగా బడంగ్‌పేటలో నివసిస్తున్నారు. వీరి కూతురు మనస్వి(22) బీటెక్ పూర్తి చేసి బ్యాంకు ఉద్యోగాల కోసం దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ఇన్స్టిట్యూట్లో పోటీ పరీక్షకు శిక్షణ పొందింది. నెల్లూరు జిల్లా నారాయణరెడ్డిపేటకు చెందిన జానా జనార్దన్ కుమారుడు వెంకటేశ్(23)తో అదే ఇన్స్టిట్యూట్లో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ నాలుగు నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఇక్కడ కోచింగ్ ముగిశాక ఫిబ్రవరిలో ఆర్ఆర్బీ పరీక్ష కోసం చైతన్యపురిలోని ఐఏసీఈలో వెంకటేష్ చేరాడు. ఆ యువతి కూడా మార్చి చివరి వారంలో అదే కోచింగ్ సెంటర్లో చేరింది. మే 20తో కోచింగ్ ముగిసింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో ఆ యువతి బ్యాంక్ పీవోస్ పరీక్ష కోసం సిద్ధమవుతోంది. అయితే ఆమె తనతో సరిగా మాట్లాడడం లేదని వెంకటేష్ అనుమానం పెంచుకున్నాడు.
నెల్లూరు నుంచి ఉదయమే నగరానికి వచ్చిన వెంకటేశ్ ఓ యాప్ ద్వారా బృందావన్‌లో గది బుక్ చేశాడు. 10 గంటలకు రూంలో దిగి మనస్వికి ఫోన్ చేసి రప్పించాడు. 11.30 గంటల ప్రాంతంలో మనస్వి హోటల్‌కు చేరుకుంది. వేరే యువకుడితో సన్నిహితంగా ఉంటూ కొంతకాలంగా తనను నిర్లక్ష్యం చేస్తోందని మనస్విపై వెంకటేశ్ కోపం పెంచుకున్నాడు. హోటల్ గదిలో ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వెంట తెచ్చుకున్న కూరగాయల కత్తితో మనస్వి గొంతు కోసి, తన రెండు చేతులను కోసుకున్నాడు. హోటల్‌కు వచ్చిన కొద్దిసేపటికే మనస్వి తన సోదరుడు శ్రీతేజకు ఫోన్ చేసి బృందావన్ హోటలో ఉన్నానని, తనపై దాడి జరుగుతోందని చెప్పింది. ఫోన్లో ఆమె కేకలు కూడా వినిపించాయి. శ్రీతేజ, తల్లి కమలకుమారి హుటాహుటిన బైక్‌పై బయలుదేరారు. మొబైల్లో గూగుల్ నావిగేషన్(మ్యాప్) సహాయంతో హోటల్‌కు చేరుకున్నారు. హోటల్ సిబ్బందితో కలసి రూంలోకి వెళ్లి చూడగా ఇద్దరూ రక్తపుమడుగులో పడి ఉన్నారు. బెడ్, గది అంతా రక్తసిక్తమైంది. మెడ కోసి ఉండటంతో తీవ్రంగా గాయపడ్డ మనస్విని వెంటనే కొత్తపేటలోని ఓమ్ని ఆసుపత్రికి తరలించారు. చేతిపై గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న వెంకటేశ్‌ను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో 3 కత్తులు, ఇద్దరి సెల్ఫోన్లు, హోటల్ సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. వెంకటే్‌షపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కొరకు మా క్రైమ్-న్యూస్ పేజీ ని వీక్షించండి!