Skip to main content
Latest News

ప్రేమ పెళ్లి చేసుకున్న వాడే.. నాలుగేళ్ల తర్వాత భార్య తల నరికేశాడు..

విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతకంగా కడతేర్చాడు. ఆమె తలను నరికి ఆ తర్వాత ఆ తలను చేత్తో పట్టుకుని రోడ్డుపైకి నడుచుకుంటూ వచ్చాడు. ఈ భీతావహ దృశ్యాన్ని చూసిన స్థానికులు కేకలు వేయడంతో తలను సమీపంలోని ఏలూరు కాలువలో పడేశాడు. అనంతరం సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్‌ కాలనీ నాలుగోలైన్‌కి చెందిన గోపిశెట్టి లక్ష్మికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మణిక్రాంతి, కృష్ణాజిల్లా ఘంటసాల సమీపంలోని శ్రీకాకుళానికి చెందిన పేటేటి ప్రదీప్ కుమార్‌ విజయవాడలోని టీఎస్‌ఆర్‌ కంపెనీలో పనిచేసేవాడు. మణిక్రాంతి కూడా అదే కంపెనీలో పనిచేసేది. ప్రదీప్‌ ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కులాలు వేరైనా ఆమెనే పెళ్లి చేసుకుంటానని ప్రదీప్‌ పోలీసులకు చెప్పాడు.

మణిక్రాంతి కుటుంబ సభ్యులను కూడా ఒప్పించి 2014లో పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలంగా ప్రదీప్‌ అక్క ఝూన్సీరాణి, తల్లి తరచూ కట్నం కోసం మణిక్రాంతిని వేధిస్తుండడంతో చివరకు ఆమె వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రదీప్‌ను పోలీసులు అరెస్టుచేశారు. ఇరువురూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి మణిక్రాంతి తన తల్లి వద్దే ఉంటోంది. జైలు నుంచి బయటకు వచ్చిన ప్రదీప్‌ తనను వెంబడిస్తున్నాడని బాధితురాలు ఇటీవల తల్లికి చెప్పినట్లు సమాచారం. అంతేకాక, ఇరవై రోజుల కిందట ఝాన్సీ, మణిక్రాంతి ఘర్షణ పడి ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. విజయవాడలో ఉండే ప్రదీప్‌ సోదరి వద్దకు వెళ్లొద్దని మణిక్రాంతి హెచ్చరించేది. అది నచ్చని ప్రదీప్‌ భార్యను దూరం పెడుతూ వచ్చాడు. కొన్నాళ్లకు తనకు విడాకులు కావాలని కోర్టు నోటీసులు కూడా పంపాడు. దీనికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తోంది. గతేడాది ప్రదీప్‌ కుమార్‌, అతని సోదరి కలిసి మణిక్రాంతిపై దాడి చేశారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతోపాటు మరికొన్ని కేసుల్లో కోర్టుకు హాజరు కానందుకు ప్రదీప్‌కు న్యాయమూర్తి అరెస్టు వారెంట్‌ జారీ చేశారు. కొద్దిరోజుల క్రితం అతన్ని పోలీసులు అరెస్టు చేసి, జైలుకు పంపారు.

రెండు రోజుల క్రితం జైలు నుంచి బయటకు వచ్చిన ప్రదీప్ తన భార్యను కడతేర్చాలని నిర్ణయించుకుని ఆదివారం ఆమె ఇంటి వద్దకు వచ్చాడు. షాపింగ్‌ నుంచి మణిక్రాంతి మ.2.30 సమయంలో ఇంటికి వచ్చింది. తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి ముందు పార్కు చేస్తుండగా ప్రదీప్‌ ఒక్కసారిగా ఆమె తలను నరికేసి ఆ తలతో నడిరోడ్డుపైకి వచ్చాడు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు కేకలు వేయడంతో తలను సమీపంలోని ఏలూరు కాలువలో పడేసి సత్యనారాయణపురం పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపుమడుగులో పడి ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. కాలువలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో రాత్రి వరకు మృతురాలి తల ఆచూకీ లభించలేదు. కాగా, పోలీసులు మృతదేహన్ని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా మృతురాలి కుటుంబసభ్యులు అడ్డుకున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కొరకు మా క్రైమ్ న్యూస్ పేజీ నీ వీక్షించండి.

Crime Stories Telugu