Skip to main content
Latest News

‘నా భార్యను చంపేశా.. వచ్చి శవాన్ని తీసుకెళ్లండి..’

‘నా భార్యను చంపేశా.. గొంతు కోసి మరీ హత్య చేశా.. వచ్చి నా భార్య శవాన్ని తీసుకెళ్లండి..’ అంటూ ఓ వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్‌తో పోలీసులు షాక్ తిన్నారు. హైదరాబాద్‌లోని గోల్కొండ పరిధిలో సోమవారం దారుణ ఘటన జరిగింది.  గొడవల కారణంగా భార్యను గొంతు కోసి మరీ భర్త హత్య చేయడంతో.. గోల్కొండ ఠాణా పరిధి మోతీమహల్‌లో కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతీమహల్‌కు చెందిన బషీర్‌ అహ్మద్‌ క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఇదివరకే పెళ్లైంది. ఆ తర్వాత భార్య చెల్లెలు సమీరా బేగం (35)ను కూడా పెళ్లి చేసుకున్నాడు. సమీరాను రెండో పెళ్లి చేసుకుని సజావుగానే ఉంటున్నారు. వీరికి నలుగురు సంతానం. అయితే ఇటీవలి కాలంలో భర్త తీరుపై సమీరాకు అనుమానం కలిగింది. భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ.. తనను, తన పిల్లల్ని పట్టించుకోవడం లేదన్న ఆవేదన ఆమెలో ఉంది. 

సమీరా బేగంపై బషీర్‌ అనుమానం పెంచుకోవడంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. తాజాగా ఈ గొడవలు పోలీస్‌ స్టేషన్‌ వరకూ చేరడంతో కొద్దిరోజుల కిందట ఇద్దరికీ కౌన్సెలింగ్‌ కూడా నిర్వహించామని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 11.30 గంటలకు పోలీసులకు బషీర్‌ ఫోన్‌చేసి భార్యను హత్య చేసినట్లు తెలిపి పరారయ్యాడు. సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సైలు సతీష్‌రెడ్డి, శ్రీనివాసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. గొంతుకోసి ఆమెను హత్య చేసినట్లు గుర్తించారు. ఘటనాస్థలంలో ఆయుధం దొరకలేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని క్రైమ్ వార్తల కొరకు మా క్రైమ్ న్యూస్ పేజీ నీ వీక్షించండి.

Crime Stories Telugu