Skip to main content
Latest News

పెళ్లైన పదో రోజే భర్త చెప్పింది విని ఖంగుతిన్న భార్య.. చివరకు జరిగిందో ఘోరం

అప్పటికి సరిగ్గా పెళ్లయి పది రోజులు.. భర్త ప్రేమగా తన భార్య పక్కన కూర్చున్నాడు. ముచ్చట్లు పెట్టి.. మురిపెం చేస్తాడని ఆమె ఊహించింది.. కానీ ఊహించని రీతిలో అతడి ప్రపోజల్ విని ఖంగుతింది. ఏమయిందో ఏమో కానీ.. ‘చచ్చిపోదాం.. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోదాం..’ అంటూ భార్యతో అన్నాడు. అతడి మాటలు విని షాకయి.. అప్పటికి అతడిని ఊరడించింది. ఏ కష్టం వచ్చినా తాను కూడా తోడుంటానంటూ భరోసా ఇచ్చింది. ఆ తర్వాతి రోజుల్లో కూడా పదే పదే అవే మాటలు అతడి నోటి నుంచి రావడంతో.. అసలు సమస్య ఏంటో తెలుసుకుని పరిష్కరిద్దామంటూ కుటుంబసభ్యులకు చెప్పింది. వారంతా అడిగినా అతడు నోరు మెదపలేదు. చావనులే.. అంటూ ముక్తసరిగా ఓ మాట చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయేవాడు. అయినా అతడి మనసులో ఆత్మహత్య బీజం అలాగే ఉండిపోయింది. ఇది గ్రహించని ఆ భార్య.. ఓ రోజు భర్త బైక్ ఎక్కింది. చుట్టాలింటికి వెళ్లొద్దామంటే సరేనని తలూపింది. కానీ అదే వారిద్దరి చివరి ప్రయాణమని ఊహించలేకపోయింది. మార్గమధ్యంలోనే భార్యను చంపి.. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడా భర్త.. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన.. స్థానికంగా చర్చనీయాంశమయింది. 

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఉయ్యాలవాడకు చెందిన పిక్కిలి రామయ్య(22)కు ఆదిమూర్తిపల్లికి చెందిన చంద్రవతి(19)తో మే 22న వివాహం జరిగింది. పెళ్లయిన పదోరోజు నుంచీ ఆత్మహత్య చేసుకుందామని భార్యపై ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. చంద్రవతి భర్తకు నచ్చచెప్పినా మార్పు రాకపోవడంతో తన తల్లిదండ్రులతోపాటు అత్తమామల దృష్టికి తీసుకెళ్లింది. వారూ రామయ్యతో మాట్లాడారు. ఆత్మ హత్య ఆలోచన ఎందుకు చేస్తున్నాడని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆయన ఏమీ చెప్పలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం కంభంలో బంధువుల ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి చంద్రవతిని మోటార్‌ సైకిల్‌పై ఎక్కించుకొని బయల్దేరాడు. మధ్యలోని ఓ దుకాణంలో కూల్‌డ్రింక్‌ బాటిల్‌ను కొనుగోలు చేశాడు. నేరుగా తన పొలం వద్దకు ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ రాళ్లు, కర్రతో ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం అప్పటికే తన వద్ద ఉన్న పురుగు మందును కూల్‌డ్రింక్‌ బాటిల్‌లో కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం అటువైపు వెళ్లిన పశువుల కాపరులు పొలంలో ఉన్న మృతదేహాలను చూసి గ్రామస్థులకు తెలియజేశారు. దీంతో రామయ్య తల్లిదం డ్రులు అక్కడికి చేరుకుని మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ సుందర్‌వలి సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని క్రైమ్ వార్తల కొరకు మా క్రైమ్ న్యూస్ పేజీ నీ వీక్షించండి.

Crime Stories in Telugu