Skip to main content
Latest News

ఇంత నీచమా..? 75 ఏళ్ల వయసులోనూ భార్యపై అనుమానంతో చంపేశాడు..!

75 ఏళ్ల వృద్ధాప్యంలోనూ భార్యపై అనుమానంతో భర్త చేసిన దారుణం సమాజాన్ని షాక్‌కి గురి చేస్తుంది. కాటికి కాళ్ళు చాపిన వయసులో వృద్ధురాలైన భార్య వివాహేతర సంబంధం నడుపుతుందని అనుమానించి ఆమెను హత్య చేసిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో సంచలనం రేపింది. భార్యను హతమార్చటమే కాకుండా తాను ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వృద్ధుడిని ఆస్పత్రికి తరలించారు. సంఘటన వివరాల్లోకి వెళితే వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన 65 ఏళ్ల పల్నాటి చిలకమ్మను దారుణంగా హతమార్చాడు భర్త పల్నాటి బుచ్చయ్య. చిలకమ్మ బుచ్చయ్య దంపతులకు అయిదుగురు కుమార్తెలు ఒక కుమారుడు. అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇక మనవళ్లు మనవరాళ్లు కూడా పుట్టారు. అయితే ఇంత వయసు వచ్చినా బుచ్చయ్య కు భార్యపై అనుమానం మాత్రం పోలేదు. ఆమె ఎవరితో మాట్లాడిన వివాహేతర సంబంధాలు అంటగట్టి దూషించి తీవ్రంగా కొట్టేవాడు. చిలకమ్మ ఎటు వెళ్ళినా ఆమెతోపాటు వెళ్లేవాడు. ఇక పిల్లల ఇంటికి వెళ్లినా చిలకమ్మను సహించే వాడు కాదు. ఇంటి పక్కన ఉంటున్న తన మూడవ కుమార్తె శకుంతలతో కూడా మాట్లాడనివ్వక పోయేవాడు.
 
వృద్ధుడిలో రోజు రోజుకు అనుమానం ఎక్కువ కావడంతో చిలకమ్మను హత్య చేసేందుకు రెండుసార్లు యత్నించాడు. ఓసారి తమ ఇంటి ఎదుట గోతి తవ్వి అందులో వేసి హత మార్చాలని యత్నించాడు. దీంతో భర్త వేధింపులు తాళలేక వృద్ధురాలు తన సోదరుడి ఇంటికి ఇటీవల వెళ్లింది. దీంతో వృద్ధుడు చిలకమ్మను రప్పించేందుకు కుట్రపన్ని తన కుమారుడికి ఫోన్‌ చేసి వరినాటు వేయాలని, చిలకమ్మ తన తమ్ముడి ఇంటికి పోయిందని, తీసుకొని రమ్మని చెప్పాడు. కుమారుడు ఫోన్‌ చేయడంతో చిలకమ్మ స్వగ్రామానికి వచ్చింది. దీంతో నాలుగు రోజుల నుంచి చిలకమ్మను చంపుతానని భర్త బెదిరిస్తున్నాడు. చిలకమ్మను హత మార్చేందుకు మరోసారి యత్నించాడు. ఇంట్లో ఉన్న గ్యాస్‌ను లీక్‌ చేశాడు. అయినప్పటికీ వృద్ధుడి లక్ష్యం నెరవేరక పోవడంతో శనివారం రాత్రి చిలకమ్మ బెడ్‌పై నిద్రిస్తుండగా కత్తితో దాడి చేశాడు. ఆమె ప్రతిఘటించినప్పటికీ వెనక్కి తగ్గకుండా శరీరంపై పలు చోట్ల తీవ్రంగా గాయపరిచాడు.
 
చివరికి వృద్ధురాలి మెడ కోసి హత మార్చాడు. చిలకమ్మ చనిపోయిన విషయం నిర్ధారణ చేసుకున్న వృద్ధుడు నేరం తనపై రాకుండా ఉండేందుకు మొదట ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకోవడంతో తలకు మంటలు అంటుకోగా చనిపోయేందుకు ధైర్యం చాలక వెంటనే మంటను చల్లార్పుకొన్నాడు. అదే కత్తితో తన గొంతును కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పపడ్డాడు. వరినాటు పనులకు వచ్చిన సల్పాల ఓదెలు కూలి డబ్బులు అడిగేందుకు బుచ్చయ్య ఇంటికి వచ్చే చూసేసరికి వృద్ధురాలి హత్య విషయం బయటపడింది. దీంతో గ్రామస్థులు సంఘటన స్థలానికి చేరుకుని వృద్ధుడిని నిలదీయడంతో గత రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి తమపై దాడి చేసి తన భార్యను హత మార్చారని తన గొంతును కోశారని బుకాయించాడు. దీంతో విషయం తెలుసుకున్న వృద్ధురాలి కుమార్తెలు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని రోదించారు. వృద్ధుడి తీరుపై గ్రామస్థులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన స్థలాన్ని కాజీపేట ఏసీపీ నర్సింగరావు, స్థానిక ఇన్‌స్పెక్టర్‌ డి.రవిరాజు, ఎస్‌ఐ సూర్యప్రకాష్‌ పరిశీలించారు.

గొంతు కోసుకుని గాయపడిన బుచ్చయ్య ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుమార్తెలు, కుమారుడు ఇచ్చిన సమాచారంతో బుచ్చయ్య పై కేసు నమోదు చేసిన పోలీసులు బుచ్చయ్య వైద్య చికిత్స అనంతరం ఈ కేసును సమగ్రంగా విచారించనున్నారు. ఏదేమైనా ఏడు పదుల వయసులో ఉన్న బుచ్చయ్య , 65 ఏళ్ల వయసున్న భార్య చిలకమ్మను అనుమానించడం, ఆపై హత్య గావించడం సభ్య సమాజం నివ్వెరపోయే అంశం. కాటికి కాళ్ళు చాపిన వయసులో పెళ్ళాన్ని అనుమానించిన సదరు వృద్ధుడు చేసిన హత్యోదంతం అందరినీ షాక్‌కు గురి చేస్తుంది.

మరిన్ని క్రైమ్ వార్తల కొరకు మా క్రైమ్ న్యూస్ పేజీ నీ వీక్షించండి.

Crime Stories Telugu