Skip to main content
Latest News

జుట్టు పెరుగుతుందని మందు వాడితే.. ప్రాణాలే పోయాయ్..

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఘోరం జరిగింది. జుట్టు పెంచుకోవాలనే ఆశ ప్రాణమే తీసింది. జుట్టుకు అందిస్తున్న వైద్యం వికటించి ఇంటర్ విద్యార్థిని చనిపోయింది. మృతురాలిని మౌనికగా గుర్తించారు. వైద్యం వికటించి బొబ్బలు వచ్చి మౌనిక చనిపోయిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. మౌనిక మృతికి డాక్టర్ నిర్లక్ష్యమే కారణం అని కుటుంబసభ్యులు పాలిక్లినిక్ ముందు ఆందోళనకు దిగారు. ఎమ్మిగనూరులోని పల్లవి పాలిక్లినిక్ లో ఈ ఘోరం జరిగింది.

పట్టణంలోని హరిజనవాడకు చెందిన కదిరికోట నరసన్న, రామేశ్వరమ్మ కుమార్తె మౌనిక(19) స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సవరం చదువుతోంది. తల జుట్టు రాలుతుండటంతో పాటు, వెంట్రుకలు ఒత్తుగా రావడానికి శివ సర్కిల్‌లోని పల్లవి పాలీ క్లినిక్‌ మెడికల్‌షాప్‌కు కర్నూల్‌ నుంచి వస్తున్న డాక్టర్‌ శరత్‌చంద్ర వద్ద 2 నెలల క్రితం చూపించుకుంది. డాక్టర్‌ ఇచ్చిన మందులు వాడటంతో శరీరంపై బొబ్బలు వచ్చాయి. ఇదే విషయాన్ని మెడికల్‌ షాప్‌ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. డాక్టర్‌ను రప్పించాలని లేదా ఫోన్‌లో విషయం చెప్పాలని వేడుకున్నారు. అయినా వారు తొందర పడొద్దని, తగ్గిపోతుందని, నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి ఇంటికి పంపేశారు. మూడు రోజులుగా మెడికల్‌షాప్‌ వద్దకు తిరుగున్నా పట్టించుకోకపోవటంతో ఆదివారం రాత్రి విద్యార్థినికి ఆరోగ్యం విషమించి మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆగ్రహంతో సోమవారం మెడికల్‌ షాప్‌ దగ్గకు చేరుకొని ఆందోళనకు దిగారు. మెడికల్‌ షాప్‌కు తాళం వేసి, పోలీసుకుల సమాచారం ఇచ్చారు. డాక్టర్‌పైనా, మెడికల్‌ షాపు నిర్వాహకులపైనా చర్యలు తీసుకోవాలని మృతురాలు కుటుంబ సభ్యులు కోరారు.  

డాక్టర్ శరత్ చంద్ర నిర్లక్ష్యంతోనే తమ కూతురు చనిపోయిందని మౌనిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. క్లినిక్ ముందు వారు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డాక్టర్ ఎక్కువ డోస్ ఇవ్వడం వల్లే ఒళ్లంతా బొబ్బలు వచ్చి మౌనిక మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. శరత్ చంద్ర దగ్గర రెండు నెలలుగా మౌనిక ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. తమకు న్యాయం చేయాలని, డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని మౌనిక కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కొరకు మా క్రైమ్ న్యూస్ పేజీ నీ వీక్షించండి.

Crime Stories Telugu